మళ్లీ తుఫాన్
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:20 AM
జిల్లాకు మళ్లీ తుఫాన్ గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తుఫాన్‌గా మారనుంది. ఒడిశాతోపాటు.. పశ్చిమబెంగాల్ రాష్ట్రం మధ్యలో తుఫాన్ తీరం దాటనుంది. ఈ ప్రభావంతో అతిభారీ వర్షాలు కురవనున్నాయి.
- బంగాళాఖాతంలో వాయుగుండం..
- ఈనెల 24, 25న అతి భారీ వర్షాలు
- మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ హెచ్చరిక
శ్రీకాకుళం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాకు మళ్లీ తుఫాన్ గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తుఫాన్‌గా మారనుంది. ఒడిశాతోపాటు.. పశ్చిమబెంగాల్ రాష్ట్రం మధ్యలో తుఫాన్ తీరం దాటనుంది. ఈ ప్రభావంతో అతిభారీ వర్షాలు కురవనున్నాయి. జిల్లాపై ప్రభావం చూపనుందని ‘ఇండియా మెటిరాలాజికల్ డిపార్ట్‌మెంట్’ నుంచి హెచ్చరిక జారీ అయింది. తుఫాన్ ప్రభావంతో ఈ నెల 24, 25 తేదీల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈదురుగాలులు బలంగా వీయనున్నాయి. దశాబ్ధాల తరబడి అక్టోబరులో వాటిల్లే తుఫాన్‌కు జిల్లా వాసులు భయపడుతూనే ఉంటున్నారు. తాజాగా మళ్లీ తుఫాన్ గండంతో భీతిల్లుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్.. జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఆదేశించారు.
అధికారులు అందుబాటులో ఉండాలి
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం అన్ని మండలాల అధికారులు, తుఫాన్ ప్రత్యేకాధికారులతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ‘అన్ని మండలాల్లో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాల్సిందే. ముందస్తుగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి. తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి. సముద్రంలోకి చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు ఒడ్డుకు చేరుకోవాలి. తీర ప్రాంతాల్లోనూ.. నదీ పరివాహక ప్రజలు 24, 25 తేదీల్లో బయటకు వెళ్లకూడదు. వీలైనంతవరకు సురక్షిత ప్రాంతాల్లోనూ.. తుఫాన్ రక్షిత భవనాల్లో ఉండాలి. ఆర్‌అండ్‌బీ, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, హెల్త్ అధికారులు సిద్ధంగా ఉండాలి. రోడ్లపై చెట్లు కూలినా వెంటనే తొలగించేందుకు ఎక్స్‌కవేటర్లను అందుబాటులో ఉంచాలి. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్‌లు తుఫాన్ నష్ట నివారణకు చర్యలు చేపట్టాలి. మండల స్థాయిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేయాలి’ అని కలెక్టర్ ఆదేశించారు. ‘ప్రజల అవసరం కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ 08942-240557 నంబర్‌ను వినియోగించుకోవాలి. చెరువులను, కాలువ గట్లను ముందుగా పరిశీలించి చర్యలు చేపట్టాలి. లోతట్టు ప్రాంతాలు జలమయమైతే మోటార్లతో నీటిని తోడించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి’’ అని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.