Share News

ఇంకా పాత ధరలే..

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:22 AM

‘జే’ బ్రాండ్లకు కాలం చెల్లిందని... నాణ్యమైన మద్యం లభిస్తుందని మందుబాబులు ఆశపడ్డారు. గత నాలుగు రోజుల నుంచి కొత్త వైన్‌షాపులు ఏర్పాటయ్యాయి. జిల్లాలో మొత్తం 158 మద్యం దుకాణాలకుగాను ప్రస్తుతం 156 దుకాణాలు ప్రారంభించేశారు.

ఇంకా పాత ధరలే..

- జిల్లాలో తెరచుకున్న ప్రైవేటు మద్యం దుకాణాలు

- రూ.99 కోసం మందుబాబుల ఎదురుచూపులు

- రెండు రోజుల్లో కొత్తవి అందుబాటులోకి..

శ్రీకాకుళం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ‘జే’ బ్రాండ్లకు కాలం చెల్లిందని... నాణ్యమైన మద్యం లభిస్తుందని మందుబాబులు ఆశపడ్డారు. గత నాలుగు రోజుల నుంచి కొత్త వైన్‌షాపులు ఏర్పాటయ్యాయి. జిల్లాలో మొత్తం 158 మద్యం దుకాణాలకుగాను ప్రస్తుతం 156 దుకాణాలు ప్రారంభించేశారు. కాగా.. మద్యం దుకాణాల్లో పాత ధరలకే విక్రయిస్తున్నారని, ప్రభుత్వం మార్పు చేసిన ధరలు ఇంకా అందుబాటులోకి రాలేదంటూ అంతటా మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రూ. 99కే షాట్‌లను దింపింది. అయితే ప్రస్తుతం జిల్లాలో ఇవి ఎక్కడా అందుబాటులో లేవు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే... ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడలేదని.. రెండు మూడురోజుల్లో వస్తాయని వ్యాపారులు వెల్లడిస్తున్నారు.

- ‘గుడ్‌ విల్‌’ విక్రయాలు పూర్తి...

సిండికేట్‌గా దరఖాస్తులు వేసిన వ్యాపారులు... ‘గుడ్‌విల్‌’ పేరిట విక్రయాలను పూర్తిచేసుకున్నారు. అన్ని మండలాల్లోనూ పది మంది నుంచి ఇరవై మందిగా సిండికేట్‌ అయి.. అన్నిచోట్లా దుకాణాలను కొనుగోలు చేశారు. కనిష్టంగా దుకాణానికి రూ.30 లక్షలు ధర నిర్ణయించి.. పెద్దసెంటర్లు అయిన శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పలాస, నరసన్నపేట, ఆమదాలవలస నియోజకవర్గాల్లో రూ.కోట్ల వరకు ధర చెల్లించి వైన్‌ షాపు పొందిన వ్యక్తినుంచి కొనుగోలు చేసుకున్నారు. దుకాణాల పరిధిలో బెల్ట్‌ దుకాణాలు ఏయే ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలన్నది సమాలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఓ రెండు నెలలు.. ఏవిధమైన అధిక ఆదాయం కోసం వెతికి ఇబ్బందులు తెచ్చుకోకుండా.. అధికారులకు కూడా ‘మామ్మూళ్లు’ అలవాటు అయ్యాక వ్యాపారం విస్తరించుకుందామని భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

- రూ. 39.37 కోట్లు మేర విక్రయాలు..

ఈనెల 16 నుంచి జిల్లాఅంతటా మద్యం దుకాణాలు ప్రైవేటు పరమయ్యాయి. ఇప్పటివరకు శనివారం నాటికి రూ.39.37 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి. పాత ధరలే ఇంకా ఉండటంతో అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. వాటినే మందుబాబులు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు మాత్రం.. మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం విధించిన ధరలు అమల్లోకి తెస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇందులో షాట్‌, కేరళ, సుమో... వంటి మద్యం రూ.99కే విక్రయాలు జరగనున్నాయి. ఇతర బ్రాండెడ్‌ మద్యం కూడా అప్పటినుంచే లభించనున్నట్లు సమాచారం.

Updated Date - Oct 21 , 2024 | 12:22 AM