12 నుంచి ప్రైవేటు మద్యం
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:54 PM
ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో ఈ నెల 12 నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటుకు గెజిట్‌ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు.. జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు మంగళవారం విడుదల చేశారు.
- జిల్లాలో 158 దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్
- ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
- ఈనెల 11న అంబేద్కర్ ఆడిటోరియంలో ‘డ్రా’
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో ఈ నెల 12 నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటుకు గెజిట్‌ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు.. జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు మంగళవారం విడుదల చేశారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 158 మద్యం దుకాణాల ఏర్పాటు చేయనున్నారు. 13 కేంద్రాల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు రెండేళ్ల కాల పరిమితికిగానూ మద్యం దుకాణాల ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 9న సాయంత్రం వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ నెల 11న ఉదయం 8గంటలకు శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో దరఖాస్తులను కలెక్టర్ ‘డ్రా’ తీసి దుకాణాలను కేటాయిస్తారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, రణస్థలం, పొందూరు, నరసన్నపేట, కొత్తూరు, పాతపట్నం, టెక్కలి, కోటబొమ్మాళి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దుకాణాల ఏర్పాటుకుగానూ నాన్‌రిఫండబుల్ దరఖాస్తు రుసుం కింద రూ.2లక్షలు చెల్లించాలి. దుకాణం దక్కించుకున్నవారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధితోపాటు పెద్ద మండలాల్లో తొలిఏడాది రూ.65లక్షలు, రెండో ఏడాది రూ.71.50 లక్షలు ఎక్సైజ్ ట్యాక్స్ చెల్లించాలి. ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి, పలాస రూరల్ ప్రాంతాల్లో మాత్రం దుకాణాలను దక్కించుకున్నవారు తొలి ఏడాది రూ.55లక్షలు, రెండో ఏడాది రూ.60.50 లక్షలు ఎక్సైజ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
- కొత్త దుకాణాల ఏర్పాటు ఇలా..
శ్రీకాకుళం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో 19 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. గారలో 7, ఎచ్చెర్లలో 6, ఆమదాలవలసలో 7, బూర్జలో 2, ఎల్.ఎన్.పేటలో 2, సరుబుజ్జిలిలో 2, రణస్థలంలో 10, లావేరులో 5, పొందూరులో 6, జి.సిగడాంలో 4, నరసన్నపేటలో 8, పోలాకిలో 4, కొత్తూరులో 4 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. హిరమండలంలో 3, పాతపట్నంలో 4, సారవకోటలో 4, టెక్కలిలో 6, నందిగాంలో 2, మెళియాపుట్టిలో 2, కోటబొమ్మాళిలో 6, సంతబొమ్మాళిలో 5, జలుమూరులో 4, పలాస టౌన్ అండ్ రూరల్‌లో 10, వజ్రపుకొత్తూరులో 5, సోంపేటలో 5, మందసలో 5, కంచిలిలో 2, ఇచ్ఛాపురంలో 5, కవిటి మండలంలో 3 చొప్పున మొత్తం 158 ప్రైవేటు మద్యం దుకాణాలు ఈనెల 12 నుంచి ఏర్పాటు కానున్నాయి.