సంతబొమ్మాళిలో పెట్రోకెమికల్స్
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:39 AM
జిల్లా అభివృద్ధితోపాటు స్థానికంగా ఉపాధి కల్పించేలా దృష్టి సారించామని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సంతబొమ్మాళి మండలంలో రూ.60వేల కోట్లతో పెట్రోకెమికల్స్ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
- రూ.60వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు
- అభివృద్ధితోపాటు ఉపాధి కల్పనపై దృష్టి
- బెల్టుషాపులకు వేలం వేస్తే కఠిన చర్యలు
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
సంతబొమ్మాళి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధితోపాటు స్థానికంగా ఉపాధి కల్పించేలా దృష్టి సారించామని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సంతబొమ్మాళి మండలంలో రూ.60వేల కోట్లతో పెట్రోకెమికల్స్ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. శనివారం లక్కివలసలో పింఛన్లు పంపిణీ చేశారు. రూ.70లక్షల వ్యయంతో బోరుభద్ర - పాతమేఘవరం రహదారి మరమ్మతులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘పెట్రోకెమికల్స్ పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. మండలంలో ఉప్పు భూములతోపాటు ఈస్టుకోస్టు పవర్‌ప్లాంటుతో ఏపీఐఐసీకి చెందిన 8వేల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటుతో చాలా మందికి ఉపాధి కలుగుతుంది. మూలపేటలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు ఆరు లేన్ల రహదారి నిర్మిస్తాం. దీనివల్ల పర్యాటకాభివృద్ధితో పాటు, అనుబంధ పరిశ్రమలు ఏర్పడతాయి. రూ.167కోట్లతో నరసన్నపేట నుంచి డీపీఎన్ రోడ్డుతో నౌపడ-వెంకటాపురం రహదారికి అనుసంధానం చేస్తాం. టెక్కలి నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుకు రూ.460 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపుతామ’ని తెలిపారు. గ్రామాల్లో బెల్టు షాపులకు ఎవరైనా వేలం వేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
జగన్ పాలనలో అంతా దోపిడీ..
‘గత ఐదేళ్లూ దోపిడీ పాలన సాగింది. మాజీ సీఎం జగన్ మద్యం వ్యాపారంలో రూ.60వేల కోట్లు దోచుకున్నారు. నాసిరకం మద్యం విక్రయించారు. అలాగే అదానీతో విద్యుత్ ఒప్పందం పేరిట రూ.1,500 కోట్లు దోచేశారు. గుజరాత్‌లో యూనిట్ రూ.2.60 ఉండగా.. మన రాష్ట్రంలో రూ.5.60కు ఒప్పందం కుదుర్చుకుని అక్రమాలకు పాల్పడ్డారు. ట్రూఅప్ చార్జీల పేరిట విద్యుత్ వినియోగదారులపై భారం మోపాల్సి వస్తోంది. ధాన్యం రైతులకు రూ.1600 కోట్ల బకాయిలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించాం. ‘అమ్మఒడి’, రైతుభరోసా పథకం కింద నిధులు త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామ’ని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, కింజరాపు హరివరప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షుడు జీరు భీమారావు, మాజీ ఎంపీపీ ధర్మార్జునరెడ్డి పాల్గొన్నారు.