Share News

ప్రమాదమని తెలిసినా.. ‘ఆపరే’షన్‌!

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:48 PM

కొంతమంది మూఢనమ్మకాలు, జాతకాల పేరిట ముహూర్తం చూసి.. ముందస్తు ప్రసవాలకు మొగ్గు చూపుతున్నారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసినా.. ఆపరేషన్లు చేయించేస్తున్నారు.

ప్రమాదమని తెలిసినా.. ‘ఆపరే’షన్‌!

- నమ్మకాలతో అమ్మతనానికి కోత!

- జాతకాల పేరిట ముందస్తు ప్రసవాలు

- ముహూర్తాలు చూసుకుని శస్త్రచికిత్సలు

- తల్లీ బిడ్డల ఆరోగ్యానికి శాపం

స్త్రీకి మాతృత్వం దేవుడిచ్చిన వరం. బిడ్డకు జన్మనివ్వడం స్త్రీకి పునర్జన్మగానే చెప్పవచ్చు. సాధారణ ప్రసవం తల్లీబిడ్డ ఆరోగ్యానికి మంచిది. కాగా.. ప్రస్తుత ఆధునిక పోకడలతో కొంతమంది మూఢనమ్మకాలు, జాతకాల పేరిట ముహూర్తం చూసి.. ముందస్తు ప్రసవాలకు మొగ్గు చూపుతున్నారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసినా.. ఆపరేషన్లు చేయించేస్తున్నారు. తల్లి కడుపులో నవమాసాలు ఉండి శరీర ఎదుగుదలతో భూప్రపంచలోకి అడుగుపెట్టాల్సిన శిశువులు.. అరకొర ఆరోగ్యంతోనే బయటకు వస్తున్నారు. అంతిమంగా అటు తల్లికి, ఇటు శిశువుకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.

రణస్థలం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి) :

- జే.ఆర్‌.పురం గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి విపరీతమైన జాతకాల పిచ్చి. ఇంట్లో ఇటీవల ఓ గర్భిణీ ప్రసవించింది. అయితే కుటుంబ పెద్ద పట్టుపట్టి మరీ ఎనిమిదో నెలలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పడంతో.. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆ గర్భిణీకి ఆపరేషన్‌ చేసి ప్రసవం చేయించారు.

...................

- పైడిభీమవరానికి చెందిన ఓ యువకుడికి విపరీతమైన దేశభక్తి. ఇటీవల ఆయన భార్య గర్భం దాల్చింది. అయితే పుట్టే పిల్లాడికి మహనీయుల పేరు పెట్టాలన్న ఉద్దేశంతో ఆగస్టు 15న ముహూర్తం నిర్ణయించి ఆపరేషన్‌ చేసి.. ప్రసవం చేయించారు.

......................

- లావేరుకు చెందిన ఓ యువకుడు పూర్వీకుల పేరు నిలబెట్టాలని భావిస్తుంటాడు. తాత ముత్తాతలను ఆదర్శంగా తీసుకుంటాడు. అయితే తన భార్య గర్భం దాల్చడంతో తన తాత, నానమ్మ పెళ్లిరోజున భార్యకు ప్రసవం చేయించాలని చూశాడు. పురిటి నొప్పులు రాకుండానే భార్యకు ఆపరేషన్‌ ద్వారా ప్రసవం చేయించాడు.

......

...ఇలా జాతకాలు, లేనిపోని నమ్మకాలతో అమ్మతనానికి కోత విధిస్తున్నారు. చాలా మంది సాధారణ ప్రసవం కోసం ఎదురుచూడకుండా.. ముందస్తు ప్రసవాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముందుగానే బ్రహ్మణుల వద్దకు వెళ్లి పలానా రోజు మంచిది అంటూ ముహూర్తాలు నిర్ణయిస్తున్నారు. ఆగస్టు 15, జనవరి 1 వంటి పర్వదినాల నాడు ప్రసవాలు చేయించిన వారూ ఉన్నారు. పెద్దల పేరిట సెంటిమెంట్‌ అని ఒకరు.. చనిపోయిన పూర్వీకుల పుట్టినరోజు అని మరొకరు.. ఇలా ప్రతిఒక్కరూ ఆపరేషన్ల ద్వారా ముందస్తు ప్రసవాలు చేయించేస్తున్నారు. కాసుల కక్కుర్తిపడిన వైద్యులు సైతం ప్రసవాలు కోసం వెళ్తున్న వారి మైండ్‌లో ఏవేవో ఆలోచనలు పెడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు సైతం సుఖ ప్రసవాలు అన్న విషయాన్నే మరిచిపోతున్నారు. పేరుకే ప్రభుత్వాస్పత్రుల్లో సుఖ ప్రసవాలని చెప్పుకొస్తున్నారు. దీనిని ప్రచార ఆర్భాటం చేసేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో గత మూడేళ్లలో సాధారణ ప్రసవాలు పది వేలకు మించి జరగలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. గర్భిణీలకు తొలి నెల నుంచీ వారి ఆరోగ్య పరిస్థితిని ఆశా కార్యకర్తలు పరిశీలించాలి. ఎప్పటికప్పుడు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో పరీక్షలు చేయించాలి. హైరిస్క్‌ కేసులను ముందుగానే గుర్తించి పెద్దాస్పత్రులకు రిఫర్‌ చేయాలి. కానీ జిల్లాలో ఇవేవీ సక్రమంగా జరిగిన దాఖలాలు లేవు. శని, ఆదివారాలు వస్తే చాలు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు కనిపించడం లేదు. దీంతో చాలామంది ఆర్థిక భారమైనా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యులు ఆపరేషన్ల పేరిట అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు.

- ఈ మాటలతో భయపెడతారు..

ప్రైవేటు ఆస్పత్రికి గర్భిణీని తీసుకెళ్తే కొన్ని మాటలు వినిపిస్తాయి. ‘రక్తం తగ్గిందని, బిడ్డ ఉమ్మనీరు తాగేసిందని, బరువు ఎక్కువగా ఉందని, రక్తపోటు అధికమైందని, బిడ్డ అడ్డం తిరిగిందని..’ ఇలా రకరకాల కారణాలు చెబుతూ అమ్మ కడుపు కోసేస్తున్నారు. రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. బాధితుల్లో ఎక్కువగా పేదలు, సామాన్యులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గర్భిణీకి ఆపరేషన్‌ చేస్తే అందుకు గల కారణాలను రిపోర్టులో స్పష్టంగా రాయాలి. కానీ అనారోగ్య కారణాలు చూపుతూ ఇష్టారాజ్యంగా శరీరంపై కత్తిగాట్లు పెడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా.. అత్యవసరమని చెప్పి ఆపరేషన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

- శిశువు ఎదుగుదల లేకుండా..

శిశువు శరీరంలో అన్ని అవయవాలు పూర్తిస్థాయిలో వృద్ధి చెందేందుకు 39 వారాల సమయం పడుతుంది. అప్పుడే శిశువు ఆరోగ్యంగా జన్మిస్తుంది. కానీ ఒక నెల ముందుగానే ప్రసవాలు చేస్తుండడంతో వారి ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతోంది. ఆపరేషన్‌ ద్వారా ప్రసవించిన శిశువు బరువు చాలా తక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తులు సరిగ్గా ఎదగవు. దీంతో శ్వాస సంబంధమైన సమస్యలు వస్తాయి. పచ్చకామెర్లతో పాటు ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు సైతం సోకుతాయి. రోగ నిరోధక శక్తి సైతం అంతంతమాత్రమే. జీవితాంతం రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

అది చాలా తప్పు

జననాన్ని నిర్దేశించేవాడు భగవంతుడు. సృష్టికర్త బ్రహ్మ. దానిని మనమెలా నిర్దేశిస్తాం. తల్లి కడుపులో నవ మాసాలు మోసి.. భూమిపై అడుగుపెట్టేది దివ్యమైన ముహూర్తం. కానీ మనం పెట్టే ముహూర్తం నాడు ప్రసవం చేయించడం ముమ్మాటికీ నేరం. పుణ్యం, పురుషార్థం, భవిత ఉంటుందని భావించడం భ్రమే. జ్యోతిష్య శాస్త్రంలో అటువంటి వాటికి స్థానం లేదు.

- మేడూరి బాలకృష్ణశర్మ, జ్యోతిష్య పండితులు గిరువానిపాలేం, రణస్థలం

.........................

తల్లీ బిడ్డలకు ప్రమాదం

ముందస్తు ప్రసవం అనేది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప.. ముందస్తు ముహూర్తాలు ప్రసవాలు చేయించడం నేరంగా పరిగణిస్తారు. వీలైనంత వరకూ సాధారణ ప్రసవాల కోసం ఎదురుచూడాలి. తప్పదని భావిస్తే తప్ప ఆపరేషన్‌ చేయకూడదు. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెరగాలి.

- డాక్టర్‌ కృష్ణచైతన్య, పాతర్లపల్లి పీహెచ్‌సీ

Updated Date - Oct 19 , 2024 | 11:48 PM