ఒక్కరోజు నిలిచిన మద్యం విక్రయాలు
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:08 AM
గత వైసీపీ సర్కారు ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటుచేసి.. అన్ని దుకాణాల్లో సిబ్బందిని నియమించింది.
- దుకాణాలు మూసివేసి నిరసన వ్యక్తంచేసిన సిబ్బంది
శ్రీకాకుళం, (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ సర్కారు ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటుచేసి.. అన్ని దుకాణాల్లో సిబ్బందిని నియమించింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం.. పాతపద్ధతి తొలగించి దుకాణాల నిర్వహణ బాధ్యత ప్రైవేటుకే కేటాయించేలా నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్ కూడా జారీ చేసేసింది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాల్లో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సూపర్ వైజర్లను, సేల్స్‌మెన్లను నియమించుకున్నారు. వాళ్లందరూ.. రాష్ట్ర యూనియన్ మేరకు మంగళవారం నిరసన చేపట్టారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరవనీయకుండా సమ్మె కొనసాగించారు. ప్రైవేటు దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల తాము రోడ్డున పడతామని, తమ భవిష్యత్తు విషయంపై ప్రభుత్వం ప్రకటించాలంటూ ఆందోళన చేపట్టారు. అయితే ఎక్సైజ్ అఽధికారులు రంగంలోకి దిగి.. రాత్రి 9 గంటల్లోగా దుకాణాలు తెరిచేలా ప్రయత్నాలు చేపట్టారు.