కొత్తమ్మ.. కరుణించమ్మా
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:52 PM
భక్తుల పాలిట కల్పవల్లిగా పేరొందిన కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతర ఉత్సవాలు మంగళవారం అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
కోటబొమ్మాళిలో ఉత్సవాలు ప్రారంభం
కోటబొమ్మాళి, అక్టోబరు 1: భక్తుల పాలిట కల్పవల్లిగా పేరొందిన కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతర ఉత్సవాలు మంగళవారం అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కొత్తమ్మతల్లీ.. కరుణించమ్మా అని వేడుకున్నారు. వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు.. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ సంప్రదాయం ప్రకారం దేవదాయశాఖ ఆలయ మేనేజర్ వాకచర్ల రాధాకృష్ణ స్వాగతం పలికారు. వేద పురోహితులు సుసరాపు గణపతిశర్మ, లక్ష్మీకాంతం శర్మ పూర్ణకుంభంతో వేదమంత్రోచ్ఛారణల నడుమ ఆలయంలో పూజలు నిర్వహించారు. అలాగే ఆలయంలో అమ్మవారి జంగిడిని అసాదీల కుటుంబ సభ్యులు తలపై పెట్టుకుని.. అమ్మ నిలయమైన రెడ్డికివీధి చెందిన కమ్మకట్టు చిన్నప్పలనాయుడు ఇంటి వరకూ ఊరేగించారు. మేళతాళాలతో పెద్ద ఎత్తున మహిళలు కలశాలతో తరలివెళ్లారు. మళ్లీ కొత్తమ్మతల్లి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, శ్రీకాకుళం, నరసన్నపేట ఎమ్మెల్యేలు గొండు శంకర్, బొగ్గు రమణమూర్తి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అంబికాదర్బార్ ఏర్పాటు చేసిన ఐదు అడుగుల అగరబత్తిని వెలిగించారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, మండల టీడీపీ అధ్యక్షుడు బోయిన రమేష్, గోవిందరాజులు, వెలమల కామేశ్వరరావు, తర్ర రామకృష్ణ, కోరాడ గోవిందరావు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా టెక్కలి సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.