కమనీయం.. ఆదిత్యుని కిరణ దర్శనం
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:50 PM
ప్రత్యక్షదైవం.. ఆరోగ్యప్రదాత.. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని ఉదయభానుని లేలేత కిరణాలు తాకాయి. ఈ అపురూప ఘట్టం మంగళవారం ఉదయం ఆవిష్కృతమైంది.
- మూలవిరాట్‌ను తాకిన సూర్యకిరణాలు
అరసవల్లి, అక్టోబరు 1: ప్రత్యక్షదైవం.. ఆరోగ్యప్రదాత.. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని ఉదయభానుని లేలేత కిరణాలు తాకాయి. ఈ అపురూప ఘట్టం మంగళవారం ఉదయం ఆవిష్కృతమైంది. ఉదయం 6.05 నిమిషాలకు సూర్యకిరణాలు గోపురాన్ని దాటుకుంటూ అనివెట్టి మండపం, ధ్వజస్తంబం మీదుగా, ఆలయ పంచద్వారాలను దాటుకుంటూ, గర్భగుడిలోని స్వామి మూలవిరాట్‌ను తాకాయి. ఈ కమనీయ దృశ్యాన్ని అధిక సంఖ్యలో భక్తులు వీక్షించి.. పులకించారు. ఓం నమో సూర్యదేవాయ అనే నామస్మరణ మార్మోగింది. రెండేళ్లుగా వాతావరణంలో మబ్బుల కారణంగా ఆదిత్యుడికి కిరణాలు స్పశించేవి కాదు. దీంతో భక్తులు నిరాశ చెందేవారు. ఈ సారి మాత్రం కిరణాలు తాకడంతో స్వామి స్వర్ణ కాంతులతో దర్శనమిచ్చారని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ ఏటా మార్చి నెల 9, 10 తేదీల్లో, అక్టోబరు 1, 2 తేదీల్లో స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకుతాయని తెలిపారు. ఈసారి కిరణస్పర్శతో అత్యంత ప్రకాశవంతంగా స్వామి దర్శనమిచ్చారన్నారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కనకరాజు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.