జగన్.. రాష్ట్రాన్ని దోచేశాడు
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:56 PM
వైసీపీ పాలనలో జగన్.. రూ.12లక్షల కోట్లు అప్పు చేసి.. రాష్ట్రాన్ని దోచుకున్నాడని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
- గత ప్రభుత్వంలో రూ.12లక్షల కోట్ల అప్పులు
- రూ.400కోట్లతో ఇంటింటికి తాగునీరు
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
సంతబొమ్మాళి, అక్టోబరు 1: వైసీపీ పాలనలో జగన్.. రూ.12లక్షల కోట్లు అప్పు చేసి.. రాష్ట్రాన్ని దోచుకున్నాడని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మంగళవారం సంతబొమ్మాళి మండలం నరసాపురంలో పింఛన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సభలో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రతి శాఖపై సమీక్ష చేయగా రూ.వేల కోట్లలో అప్పులు కనిపించాయి. గత ఐదేళ్లు అభివృద్ధి కుంటుపడింది. రోడ్లు, కాలువలు కనీస మరమ్మతులకు నోచుకోలేదు. కేంద్రం సహకారంతో అభివృద్ధి దిశగా చర్యలు చేపడుతున్నాం. అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు, పోలవరానికి రూ.12,500 కోట్లు, పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు రూ.3,500 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. టెక్కలి నియోజకవర్గంలో రూ.400 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందిస్తాం. బొంతు జంక్షన్ వద్ద ట్యాంకు నిర్మించి.. వంశధార నది నుంచి నీటిని తెచ్చి నింపుతాం. ఆ నీటిని పైపులైన్ ద్వారా ఇంటింకీ అందిస్తామ’ని మంత్రి అచ్చెన్న తెలిపారు. కార్యక్రమంలో కింజరాపు హరివరప్రసాద్, వెలమల విజయలక్ష్మి, ఎంపీటీసీ మోడి రామచంద్రరావు, మాజీ సర్పంచ్ ఆల బైరాగి, మండల టీడీపీ కార్యదర్శి రెడ్డి అప్పన్న పాల్గొన్నారు.