Share News

గంజాయి వనంలా సిక్కోలు!

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:05 AM

జిల్లాలో గంజాయి నిల్వలు పెద్ద ఎత్తున్న పట్టుబడుతున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు యథేచ్ఛగా సాగాయి. ఒడిశా నుంచి గంజాయి దిగుమతి చేసి.. జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు.

గంజాయి వనంలా సిక్కోలు!
మెళియాపుట్టిలో పట్టుబడిన గంజాయి (ఫైౖల్‌)

- గత ఐదేళ్లలో కోరలు చాచిన మాఫియా

- ఒడిశా నుంచి జిల్లాకు భారీగా దిగుమతి

- పెద్ద మొత్తంలో పట్టుబడుతున్న నిల్వలు

- మత్తుకు బానిస అవుతున్న యువత

(మెళియాపుట్టి)

- ఈ ఏడాది మార్చి 24న ఒడిశాలోని గారబంద నుంచి గంజాయి లోడుతో వస్తున్న ఆ కంటైనర్‌ను పలాసలోని నెమలి నారాయణపురం హైవేపై అడ్డుకునే ప్రయత్నం చేయగా దూసుకుపోయింది. ఎస్‌ఐ, కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. చివరకు కంటైనర్‌ విశాఖలో పట్టుబడింది. అందులో 380 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

- ఈ ఏడాది మార్చి 18న పలాస రైల్వేస్టేషన్‌లో ఒడిశాకు చెందిన కరుణకరడ అనే వ్యక్తి నుంచి పోలీసులు 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కరుణకరడ.. స్వగ్రామం నుంచి గంజాయిని మూట కట్టి.. చెన్నై తీసుకెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు.

- ఈ నెల 7న శ్రీకాకుళంలో పొన్నాడ బ్రిడ్జి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేయగా.. గంజాయి తరలిస్తూ నలుగురు పట్టుబడ్డారు. వారిని సీఐ విచారణ చేపట్టగా.. ఈక్రమంలో సుమారు 25మంది గంజాయి క్రయవిక్రయాలు, రవాణా సాగిస్తున్నట్టు తెలిసింది. దీంతో డీఎస్పీ, సీఐతోపాటు ఎక్సైజ్‌ శాఖ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి.. వాంబేకాలనీ సమీపంలో ఉన్న డచ్‌ బిల్డింగ్‌లో మరో ఐదుగురిని పట్టుకున్నారు. వారి వద్ద 17 కిలోల గంజాయి, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

- ఈనెల 10న ఇచ్ఛాపురంలోని పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద ఓ షాపులో విక్రయిస్తున్న 25 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- ఈ నెల 14న ఒడిశా నుంచి ఇచ్ఛాపురం మీదుగా కర్ణాటక రాష్ట్రానికి రైలు మార్గంలో సుమారు 11 కిలోలు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని ఇచ్ఛాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- ఈ నెల 14న ఆమదాలవలసలోని బీఆర్‌ నగర్‌ సమీపంలో ఐదుగురు యువకుల నుంచి రెండున్నర కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి తెప్పించి వారు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.

... ఇలా జిల్లాలో గంజాయి నిల్వలు పెద్ద ఎత్తున్న పట్టుబడుతున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు యథేచ్ఛగా సాగాయి. ఒడిశా నుంచి గంజాయి దిగుమతి చేసి.. జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. జిల్లాలోనూ పలుచోట్ల విక్రయాలు సాగిస్తున్నారు. గంజాయి బారిన పడి యువకులు వారి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. జిల్లాకేంద్రంలో సైతం గంజాయి బ్యాచ్‌లు నేర ప్రవృత్తికి దిగుతున్న ఘటనలు ఇటీవల వెలుగుచూస్తున్నాయి. జిల్లాకు ఒడిశాతో అనుబంధం ఎక్కువ. రోడ్డు, రైలు మార్గాల ద్వారా మాదకద్రవ్యాల రవాణా సాగుతోంది. ఒడిశాలోని గజపతి, గంజాం, రాయగడ జిల్లాలకు సంబంధించి అంతర్‌ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోడ్లలో కనీస తనిఖీలు లేవు. ఉన్న చెక్‌పోస్టులను సైతం ఎత్తేశారు. ప్రత్యేక పోలీసులను విధుల నుంచి తొలగించారు. దీంతో గంజాయి రవాణాదారులు, ముఠాలు ఇష్టారాజ్యంగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. స్థానిక యువతతో ఒప్పందం చేసుకుని వారితోనే గంజాయిని విక్రయిస్తున్నారు. యువకులు, విద్యార్థులే గంజాయి ముఠా టార్గెట్‌. ఇందుకు ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు నడుపుతున్నారు. గంజాయి తాగడాన్ని ఒక ఫ్యాషన్‌గా చెప్పి 20 ఏళ్లలోపు యువత, విద్యార్థులను ఆకర్షిస్తున్నారు.

- పెరిగిన మద్యం రేట్లతో

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు భారీగా పెరిగాయి. క్వార్టర్‌ సీసా కొనుగోలు చేయాలంటే రూ.200 పైమాటే. అదే ధరకు గంజాయి పొట్లం వస్తోంది. నలుగురు, ఐదుగురు వరకూ నిషా పొందవచ్చు. దీంతో ఎక్కువ మంది గంజాయిని తీసుకుంటున్నారు. గంజాయి మత్తుకు యువత సైతం బానిసవుతున్నారు. ముఖ్యంగా జాతీయరహదారి చెంతనే ఉన్న చాలా షాపుల వద్ద గంజాయి విక్రయాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. నిషేధిత గుట్కా, ఖైనీల మాటున గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం. గతంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు టోల్‌ఫ్రీ నెంబర్‌తోపాటు విద్యాసంస్థల వద్ద బోర్డులు ఏర్పాటు తప్ప.. గంజాయి రవాణాదారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి.

- తనిఖీ లేని చెక్‌పోస్టులు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని వసుంధర, రంపకాన, పాతపట్నం, మాతల, బలద, పట్టుపురం ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కానీ, గత ఐదేళ్లలో సెబీ, పోలీసులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. వారికి మామూళ్లు ముట్టజెప్పి.. గంజాయి రవాణా సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వసుంధర చెక్‌పోస్టు మాత్రమే కొనసాగుతోంది. అక్కడ సైతం కొన్ని వాహనాలను మాత్రమే తనిఖీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికంగా గండాహత్‌ రోడ్డు వయా గొప్పిలి రోడ్డు మార్గంలో పలాసకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. గొప్పిలి వద్ద కొంతమంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ప్రత్యేక కోడ్‌ భాషల్లో తరలిస్తున్నట్టు సమాచారం.

- విద్యార్థులతో రవాణా..

గంజాయితో పాటు బ్రౌన్‌ షుగర్‌ వంటి ప్రాణాంతక నిషేధిత వస్తువులు చలామణి అవుతున్నాయి. వీటి రవాణాకు యువత, విద్యార్థులను వినియోగిస్తుండడం విచారకరం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అద్దెకు కార్లను ఇచ్చే సంస్కృతి నడుస్తోంది. ఎవరికైనా అవసరమైతే డ్రైవింగ్‌ వస్తే రోజువారి కిరాయి రూపంలో కార్లను అద్దెకు ఇస్తుంటారు. గంజాయి రవాణాదారులకు ఇదో మార్గంగా మారింది. నలుగురైదుగురు యువకులను మాట్లాడుకుంటున్నారు. అధిక మొత్తంలో నగదు ఆఫర్‌ చేస్తున్నారు. అరకు, పాడేరు వంటి ప్రాంతాలకు పర్యాటకుల మాటున పంపిస్తున్నారు. గంజాయిని అధిక మొత్తంలో తెప్పించి స్థానికంగా విక్రయిస్తున్నారు. గంజాయికి విద్యార్థులు అలవాటు పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా కేంద్రంతోపాటు ఎచ్చెర్ల ప్రాంతంలో విద్యాసంస్థలున్నాయి. అటు ఉత్తరాది రాష్ట్రాలతో అనుబంధం ఉన్న పరిశ్రమలున్నాయి. దీంతో వీరందరికీ గంజాయి అలవాటు చేసే పనిలో మాఫియా నడుస్తోంది. గంజాయి మత్తులో పడి చాలామంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ఆ మత్తులో సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. చోరీలకు పాల్పడడమే కాకుండా తోటివారిపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

రవాణా మార్గాలు గుర్తించాం

అక్రమంగా ఒడిశా నుంచి ఆంధ్రాకు గంజాయి వచ్చే మార్గాలు గుర్తించాం. ప్రత్యేకంగా వంద రోజుల ప్లాన్‌ తయారుచూసి.. విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. పోలీసుల ఆధ్వర్యంలో నారోకోటికట్‌ టీమ్‌లు ఏర్పాటు చేసి నిఘూ పెంచుతాం. సరిహద్దు రహదారుల్లో తనిఖీలు చేస్తున్నాం.

- రాజశేఖర్‌నాయుడు, ఎక్సైజ్‌ సీఐ, టెక్కలి

............................

ప్రత్యేక దృష్టి సారించాం

జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, వినియోగం పెరుగుతోంది. యువకులు బంగారు భవిష్యత్‌ను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అందుకే గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాం. మత్తు పదార్థాల వినియోగంతో అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. తల్లిదండ్రులు కూడా పిల్లల కదలికపై దృష్టి పెట్టాలి’

- కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం

............................

సంవత్సరం కేసులు అరెస్టు పట్టుబడిన సరుకు (కిలోల్లో)

==================================

2021 21 61 2,500

2022 13 33 714

2023 27 85 484

2024 07 26 162

===================================

Updated Date - Sep 16 , 2024 | 12:05 AM