పెళ్లికి వెళ్లి వస్తూ..
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:03 AM
బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో సత్యవరం జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలాకి మండలం జిల్లేడువలసకి చెందిన నక్క రామారావు(48), తియ్యాల భవ్య (16) అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆది వారం సంభవించింది.
నరసన్నపేట, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో సత్యవరం జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలాకి మండలం జిల్లేడువలసకి చెందిన నక్క రామారావు(48), తియ్యాల భవ్య (16) అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆది వారం సంభవించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నక్క రామారావు, తియ్యాల భవ్య బైక్‌పై శ్రీకాకుళం రూరల్ మండలం పరదేశిపాలెం బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నరసన్నపేట బైపాస్ రోడ్డులో వెళ్తున్న సమ యంలో శ్రీకాకుళం నుంచి టెక్కలి వైపు వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొం ది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న నక్క రామారావు తుళ్లిపోయి సర్వీసు రోడ్డు పక్కన పడగా, లారీ ద్విచక్రవాహనంతో పాటు, భవ్య మృతదేహా న్ని కొంతవరకు ఈడ్చుకెళ్లిపోయింది. దీంతో భవ్య మృతదేహం చిధ్రంగా మారింది. రామారావు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు సపర్యలు చేసి నప్పటికీ అప్పటికే రెండు కాళ్లు విరిగిపోవడం, తలకు బలమైన గాయాలై మృతిచెందాడు. ప్రమాదానికి కార ణమైన లారీ తప్పించుకునేందుకు ప్రయత్నించగా వెనుక వైపు నుంచి వచ్చిన వాహనాలు అడ్డుకోవడం తో లారీని డ్రైవర్ నిలిపాడు. విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్‌ఐ దుర్గాప్రసాద్, ఏఎస్‌ఐ అసిరినాయుడు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. ఘటనను చూసిన వారు కంటితడిపెట్టారు. లారీ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. మృతదేహాలను నరసన్నపేట మార్చురీకి తరలించారు. మృతురాలు భవ్య నరసన్నపేటలో ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. రామారావు వ్యవసాయం చేస్తున్నారు.
ఐదు నిమిషాల్లో ఇంటికి వెళ్లాల్సి ఉండగా..
సంఘటన జరిగిన ప్రదేశం నుంచి ఐదు నిమిషాలు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తే ఇళ్లకు వెళ్లాల్సిన వీరిని లారీ రూపంలో మృత్యవు కబళించడం అక్కడి వారిని కలిచివేసింది. పక్కంటి బంధువుల పెళ్లికి చెప్పారని తన కుమారుడు సంతోష్‌కు చెప్పి ద్విచక్రవాహనం అడిగి రామారావు గ్రామం నుంచి సింగల్‌గా పరదేశిపాలెం పెళ్లికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో తియ్యాల భవ్య తల్లిదండ్రులు నరసమ్మ, గవిరేసులు అమ్మా.. పరీక్షలు అంటున్నావు.. వెళ్లిపోతానంటున్నావ్.. అంకుల్ రామారావు బండిపై ఇంటికి వెళ్లు. బాగా చదువుకో అని పంపించారు. కానీ విఽధివంచనలో ఈ విధంగా ప్రమాదానికి గురై ఇద్దరు బలి అయిపోవడంతో బంధువులు రోదిస్తున్నారు.
నాన్నా.. అమ్మ నీకోసం చూస్తోంది
సంఘటన వద్ద మృతుడు రామారావు కుమారుడు సంతోష్ తండ్రి మృతదేహాన్ని చూసి నాన్న కళ్లు తెరిచి ఉన్నారు.. ఆసుపత్రికి తీసుకువెళ్లండి... లెగు నాన్నా.. నీకోసం అమ్మ ఇంటి వద్ద చూస్తోందని అన్న మాటలు అక్కడ ఉన్న వారి కంట తడిపెట్టించాయి. చూడండి.. మానాన్న గుండె కొడుతోందని పోలీసులకు చెప్పి ఆసుపత్రికి తీసుకువెళ్లండని పదే పదే సంతోష్ తన తండ్రి గుండెపై పడిన దృశ్యం చూపరులను ఆందోళనకు గురిచేసింది.
గ్రామంలో విషాదఛాయలు
పోలాకి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): నరసన్న పేట వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన రామారావు, భవ్యల స్వగ్రామం జిల్లేడువలసలో విషాదఛాయలు అలముకున్నాయి. నక్క రామారావు, తియ్యాల భవ్యలది పక్క పక్క ఇళ్లు.. రామారావు మృతిచెందినట్లు తెలియడంతో భార్య ముత్యాలమ్మ, కుమార్తె తేజస్విని, కుమారుడు సంతోష్ కన్నీరుమున్నీరయ్యారు. భవ్య తల్లిదండ్రులు ప్రమాదం జరిగినప్పటికే పరదేశిపాలెం పెళ్లిలో ఉన్నారు. కుమార్తె మృతిచెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గవిరేసు, నరసమ్మ, సోదరుడు లోకేష్‌తో పాటు బంధువులు నరసన్నపేట ఆసుపత్రిలోని మార్చురీ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. కుమార్తె ముఖం చూపించాలని తల్లిదండ్రులు అక్కడి వారిని వేడుకున్నారు.