48 గంటలకు ముందే..
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:10 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం విక్రయాలకు రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సుదూరంలో ఉన్న మిల్లులకు ఆపసోపాలు పడి ధాన్యం తరలించి విక్రయించినా.. సకాలంలో వారి బ్యాంకు ఖాతాలో నగదు జమయ్యేది కాదు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలు తెలుసుకుని.. వారు నచ్చిన మిల్లుకు ధాన్యం విక్రయించుకునేలా అవకాశం కల్పించింది.
- రైతుల ఖాతాలో ధాన్యం డబ్బులు జమ
- అన్నదాతల్లో హర్షం
మెళియాపుట్టి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి):
మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురం గ్రామానికి చెందిన ఉర్లాన వెంకటస్వామి అనే రైతు గురువారం ధాన్యం విక్రయించగా.. శుక్రవారం ఆయన బ్యాంకు ఖాతాలో నగదు జమైంది. గతేడాది ధాన్యం విక్రయించిన రెండు నెలలు తర్వాత ఆయన ఖాతాలో డబ్బులు పడ్డాయి. ఈ ఏడాది మాత్రం తనకు నచ్చిన మిల్లుకు ధాన్యం పంపించగా.. 48 గంటలు కాకముందే డబ్బులు జమకావటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
....................
మెళియాపుట్టి మండలం జలగలింగుపురం గ్రామానికి చెందిన రాణా మహాలక్ష్మికి గతేడాది ధాన్యం విక్రయించేందుకు.. సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొప్పిలి మిల్లుకు ఇవ్వాలని అధికారులు తెలిపారు. కానీ ఈ ఏడాది మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చాపర మిల్లుకు ధాన్యం విక్రయించేందుకు అవకాశం కల్పించడంతో ఆమె హర్షం వ్యక్తం చేస్తోంది.
..........................
వైసీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం విక్రయాలకు రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సుదూరంలో ఉన్న మిల్లులకు ఆపసోపాలు పడి ధాన్యం తరలించి విక్రయించినా.. సకాలంలో వారి బ్యాంకు ఖాతాలో నగదు జమయ్యేది కాదు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలు తెలుసుకుని.. వారు నచ్చిన మిల్లుకు ధాన్యం విక్రయించుకునేలా అవకాశం కల్పించింది. దీంతోపాటు ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 4,47,382 ఎకరాల్లో వరి సాగుచేశారు. జిల్లాలో 412 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని, 570 రైస్‌మిల్లుల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వారి బ్యాంకు ఖాతాల్లో 48 గంటల్లోనే నగదు జమచేయాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. శుక్రవారం కొంతమంది రైతుల ఖాతాలో నగదు కూడా జమచేసేశారు. కాగా గతంలో మిల్లర్లు బస్తాకు నాలుగైదు కేజీలు ధాన్యం అదనంగా తీసుకునేవారని, ఈ ఏడాది ఆ పరిస్థితి లేకుండా అధికారులు చర్యలు చేపట్టడం హర్షణీయమని తెలిపారు.
...........................
రాత్రయినా తీసుకుంటున్నారు
శుక్రవారం చిరుజల్లులు పడడంతో ధాన్యం ఎక్కడ నిల్వ చేయాలో తెలియక భయపడ్డాం. కానీ రాత్రయినా సరే షెడ్యూల్ ఇవ్వటంతో ధాన్యం పంపించాం. కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం.
- చలపతి, జలగలింగుపురం
...........................
మాట నిలబెట్టుకున్నారు.ః
కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ధాన్యం డబ్బులు సకాలంలో జమ చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం రైతుల డబ్బులు దారి మళ్లించింది. ఆరు నెలలు తరువాత జమ చేసింది. మంత్రి అచ్చెన్నాయుడు కృష్టితో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
- ఉర్లాన వసంత్, టీడీపీ నాయకుడు, మెళియాపుట్టి