ఆమదాలవలస రోడ్డు.. వైసీపీ నిర్లక్ష్యానికి నిదర్శనం
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:55 PM
గత ఐదేళ్ల వైసీపీ నిర్లక్ష్య పాలనకు నిలువెత్తు నిదర్శనం.. శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు అని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఈ రోడ్డును పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
- కాంట్రాక్టరుకు తొలిదశ బిల్లు రూ.14కోట్లు నేటికీ చెల్లించలేదు
- నెలాఖరుకు ప్రత్యామ్నాయ రహదారి నిర్మిస్తాం
- ఎమ్మెల్యే కూన రవికుమార్
శ్రీకాకుళం రూరల్, సెప్టెంబరు 15: గత ఐదేళ్ల వైసీపీ నిర్లక్ష్య పాలనకు నిలువెత్తు నిదర్శనం.. శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు అని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఈ రోడ్డును పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘రోడ్డు పనులకు సంబంధించి టీడీపీ హయాంలో 2018లో రూ.37కోట్లు నిధులు మంజూరు చేశాం. తర్వాత ఎన్నికలు రాగా.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. రోడ్డు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు తొలిదశగా రూ.14కోట్ల మేర బిల్లులు నేటికీ చెల్లించలేదు. అయినా కాంట్రాక్టర్‌తో మాట్లాడి.. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇవ్వడంతో ప్రస్తుతం పనులు చేపట్టారు. కాగా.. ఇటీవల భారీ వర్షాల కారణంగా గుంతల్లో పూడ్చిన మట్టి కొట్టుకుపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. విజయనగరం, సాలూరు వెళ్లే మార్గంలో బ్రిడ్జిలు పడిపోవడంతో సుమారు 60 టన్నుల లోడుతో భారీ వాహనాలు ఇదే రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఇరువైపులా తారురోడ్డు నిర్మాణం చేపడతాం. వర్షాకాలం అనంతరం కల్వర్టులను పునర్నిర్మించి, ఆముదాలవలస నుంచి శ్రీకాకుళం వరకు పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం చేపడతా’మని రవికుమార్ తెలిపారు. అనంతరం ఏఈ, డీఈలతో ఆయన మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరగాలని ఆదేశించారు.
- విపత్తులోనూ విమర్శలా?
‘రాష్ట్రంలో గడచిన ఐదేళ్లలో రూ.12లక్షల కోట్లు జగన్‌రెడ్డి అప్పులు చేశారు. రూ.1.30లక్షల కోట్లు కాంట్రాక్టర్లకు పెండింగ్ బకాయిలు చెల్లించలేద’ని ఎమ్మెల్యే కూన రవి విమర్శించారు. విజయవాడ వరద ఉధృతిని జాతీయ విపత్తుగా పరిగణించి.. అందరూ సీఎం సహాయనిధికి విరాళాలు ఇస్తుంటే.. జగన్ రెడ్డి నీచ రాజకీయాలు చేస్తుండడం దారుణమన్నారు. విపత్తులో ఆదుకోకుండా విమర్శలు చేయడం తగదని తెలిపారు. వరదల్లో 36 మంది చనిపోతే.. 66 మంది చనిపోయారని జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.