115 జీవోపై వివాదం
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:21 AM
సర్వీస్ ఏఎన్‌ఎంలను స్టాఫ్‌నర్సులుగా నియమించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 115 వైద్య శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
- నష్టపోతామంటున్న జీఎన్‌ఎం, నర్సింగ్ ఉద్యోగులు
- దశల వారీగా ఆందోళనలు
- ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ఏఎన్‌ఎంలు
-స్టాఫ్‌నర్సులుగా సమర్థవంతంగా పనిచేస్తామని స్పష్టీకరణ
(శృంగవరపుకోట)
సర్వీస్ ఏఎన్‌ఎంలను స్టాఫ్‌నర్సులుగా నియమించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 115 వైద్య శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ ద్వారా ప్రాఽథమిక, సామాజిక, ప్రాంతీయ, జిల్లా ప్రధాన ఆసుపత్రుల్లో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను కాదని పది, ఇంటర్ అర్హతతో ఏఎన్‌ఎం శిక్షణ పొందిన వారికి నామమాత్రపు శిక్షణ ఇచ్చి స్టాప్‌నర్సులుగా ఏలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు వినతి పత్రాలు సమర్పించారు. జిల్లా, తాలుకా పరిధిలోని అధికారులకు సమస్యను విన్నవించారు. ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసి న్యాయం చేయాలని కోరారు. నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద నిరసనకు దిగారు. ఈ నెల 17న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేసేందుకు సిద్ధపడుతున్నారు. అయితే, ఈ జీవోను జీఎన్‌ఎం శిక్షణ పొందిన ఏఎన్‌ఎంలు సమర్థిస్తున్నారు. తమ శిక్షణ, ఉద్యోగ అనుభవంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమర్థవంతంగా స్టాఫ్‌నర్సులుగా విధులు నిర్వహించగలమని చెబుతున్నారు.
వైసీపీ నిర్వాకంతోనే..
గత వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. వీటిల్లో పని చేసేందుకు హెల్త్ సెక్రటరీ (ఏఎన్‌ఎం)లను నియమించింది. అప్పటికే సబ్ సెంటర్లలో శాశ్వత, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలతో సంబంధం లేకుండా ప్రతీ సచివాలయంలో హెల్త్ సెక్రటరీలను నియమించారు. వీరిని జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా ఎంపిక చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌కు చెందిన ఏఎన్‌ఎం-2లు చాలా కాలంగా కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తుండడంతో వీరికి పది శాతం గ్రేస్ మార్కులు కలిపారు. దీంతో వీరిలో అత్యధికశాతం మంది సచివాలయాల్లో ఉద్యోగాలు సాధించారు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సబ్ సెంటర్లను రద్దు చేశారు. వీటి స్థానంలో వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి సబ్ సెంటర్లను విలీనం చేశారు. వెల్‌నెస్ సెంటర్లలో బీఎస్సీ నర్సింగ్ చేసిన వారిని ఎంఎల్‌హెచ్‌పీ, సామాజిక ఆరోగ్య అధికారి (సీహెచ్‌వో) పేరుతో నియమించారు. వీటిల్లోనే సచివాలయ హెల్త్ సెక్రటరీ (ఏఎన్‌ఎం)లు పని చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇంతవరకు బాగున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ సబ్ సెంటర్లలో శాశ్వత, కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఏఎన్‌ఎంలను వైసీపీ సర్కారు నిర్లక్ష్యం చేసింది. వారిని ఎక్కడ సర్దుబాటు చేయాలో తెలియక కొన్నా ళ్ల పాటు అలాగే ఉంచేసింది. దీంతో సచివాలయానికి ఒక ఏఎన్‌ఎం ఉండడానికి బదులు ఒక్కోచోట ఇద్దరు, ముగ్గురు చొప్పున పని చేశారు. చివరకు వీరిని సర్దుబాటు చేసేందుకు అవకాశం లేకపోవడంతో కొత్త విధానానికి తెరతీసింది. 2022 జనవరి 24న జీవో ఎంఎస్ నెంబర్ 5, 2022 మార్చి 21న జీవో ఎంఎస్ నెంబర్ 57 జారీ చేసి ఏఎన్‌ఎంలుగా పనిచేస్తున్న వారికి జీఎన్‌ఎంలుగా శిక్షణ ఇస్తామని ప్రకటించింది. ఎంపీహెచ్‌డబ్ల్యూఏ (ఫిమేల్) శిక్షణ ధ్రువపత్రంతో పాటు ఇంటర్‌మీడియట్ అర్హతను నిర్ణయించింది. ఆసక్తిఉన్న సచివాలయ, సబ్ సెంటర్ ఏఎన్‌ఎంలు చేరవచ్చని పేర్కొంది. జీఎన్‌ఎం శిక్షణ ఇచ్చి స్టాఫ్‌నర్సులుగా నియమిస్తామని చెప్పింది. దీంతో ఇంటర్ అర్హతతో చాలామంది ఏఎన్‌ఎంలు జీఎన్‌ఎం శిక్షణలో చేరిపోయారు. ఇలా పోస్టులు ఖాళీ అయిన సచివాలయాల్లో సబ్ సెంటర్లకు చెందిన ఏఎన్‌ఎంలను సర్దుబాటు చేశారు. ఇంటెన్సీఫైడ్ ప్రోగ్రాంలో భాగంగా గత వైసీపీ ప్రభుత్వంలో జీఎన్‌ఎం శిక్షణ పొందిన ఏఎన్‌ఎంలను స్టాఫ్‌నర్సులుగా నియమించేందుకు ప్రస్తుత ప్రభుత్వంలోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈనెల 4న జీవో ఎంఎస్ నెంబర్ 115ను జారీ చేసింది.
ఎవరి వాదన వారిదే
115 జీవోపై ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, నర్సింగ్ ఉద్యోగుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ జీవోను ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న జీఎన్‌ఎం, నర్సింగ్ ఉద్యోగులు వ్యతిరేకిస్తుంటే.. జీఎన్‌ఎం శిక్షణ పొందిన ఏఎన్‌ఎంలు సమర్థిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం నర్సింగ్ వ్యవస్థకు వ్యతిరేకమని జీఎన్‌ఎం, నర్సింగ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఈ జీవోతో తమకు నష్టం జరుగుతుందని వాపోతున్నారు. దీనివల్ల ఎన్నో ఏళ్లగా కాంట్రాక్టు పద్ధతిలో స్టాఫ్‌నర్సులుగా పని చేస్తున్న ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఇంటర్ అర్హతతో మూడున్నరేళ్లు, నాలుగేళ్ల పాటు నర్సింగ్ శిక్షణ పొందిన వారితో స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయకుండా, పదో తరగతి అర్హతతో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఎఫ్) శిక్షణ పొందిన ఏఎన్‌ఎంలతో ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఏఎన్‌ఎంల వాదన మరోలా ఉంది. తాము పదో తరగతి అర్హతతో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్) కోర్సు పూర్తి చేసినప్పటికీ ఇంటర్ అర్హతతోనే వైద్య ఆరోగ్య శాఖ ఇంటెన్సీఫైడ్ పోగ్రాం కింద జీఎన్‌ఎం శిక్షణ పొందామని చెబుతున్నారు. ఏఎన్‌ఎం శిక్షణ 18 నెలల నుంచి రెండేళ్లు, జీఎన్‌ఎం శిక్షణ 18 నెలలతో పాటు ఉద్యోగ అనుభవం అన్నీ కలిపి జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ శిక్షణ కాలానికి సమానంగానే ఉంటుందని వాదిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమర్థవంతంగా స్టాఫ్‌నర్సులుగా విధులు నిర్వహించగలమని స్పష్టం చేస్తున్నారు. ఇలా ఎఎన్‌ఎంలు, జీఎన్‌ఎంలు, బీఎస్సీ నర్సింగ్ ఉద్యోగుల మధ్య వివాదం నడుస్తుంది.