Share News

భయపెట్టారు.. బెదిరించారు!

ABN , Publish Date - Oct 31 , 2024 | 04:54 AM

భయపెట్టారు.. బెదిరించారు.. నేను చేసిన తప్పేంటో వివరంగా చెప్పరు.. ఫోన్లు, ల్యాప్‌టాప్‌ లాక్కొని ఏకాకిని చేశారు..

భయపెట్టారు.. బెదిరించారు!

చుట్టుముట్టి మగ పోలీసుల వేధింపులు

చెంపపై కొట్టి జుట్టుపట్టుకున్న ఆడ పోలీసు

తప్పు చేయలేదని వేడుకున్నా నాడు పోలీసులు వదల్లేదు

సీఐడీ ముందు జెత్వానీ కన్నీరుమున్నీరు

నా ఫోన్లు, ల్యాప్‌టాప్‌ లాక్కున్నారు

ఖాళీ పేపర్లపై సంతకాలకు ఒత్తిడి చేశారు

4 రోజులు నరకం.. 40 రోజులు జైలు

ఐపీఎస్‌లు, ఖాకీల కర్కశత్వాన్ని వాంగ్మూలంలో వివరించిన నటి కాదంబరి

అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘భయపెట్టారు.. బెదిరించారు.. నేను చేసిన తప్పేంటో వివరంగా చెప్పరు.. ఫోన్లు, ల్యాప్‌టాప్‌ లాక్కొని ఏకాకిని చేశారు.. లాయర్‌తో మాట్లాడుకోవడానికి అవకాశమివ్వరు.. ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టమని ఒత్తిడి చేశారు.. అందరూ మగ పోలీసులు చుట్టుముట్టి వేధించారు.. ఆడ పోలీసు చెంపపై కొట్టి జుట్టు పట్టుకు లాగారు.. ఆ భూమి గురించి నాకు తెలియదని మొత్తుకున్నా వినలేదు.. నాలుగు రోజులు నరకం చూపించారు.. నలభై రోజులు జైల్లో పెట్టారు.. ఆ బాధ ఎప్పటికీ మరిచిపోలేను..’ అని ముంబై సినీనటి కాదంబరి జెత్వానీ సీఐడీ అధికారుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు. వైపీఎస్‌ అధికారుల బాధితురాలు జెత్వానీ కేసులో సీఐడీ బుధవారం ఆమెను, ఆమె తల్లిదండ్రులను మంగళగిరిలోని తమ కార్యాలయానికి పిలిపించింది. వారి వాంగ్మూలాలను రికార్డు చేసింది. తాడేపల్లి ప్యాలె్‌సలో కుట్ర చేసి ముంబై నుంచి బలవంతంగా తమను బెజవాడకు తీసుకొచ్చి వేధించిన ఐపీఎస్‌ అధికారుల కర్కశత్వాన్ని వారు వివరించారు. వైసీపీ ప్రభు త్వ పెద్దలు, వైపీఎస్‌ అధికారులు మాఫియాగా వ్యవహరించిన ఈ కుట్ర వ్యవహారం గతేడాది డిసెంబరు చివరి వారంలో తాడేపల్లి ప్యాలె్‌సలో పురుడు పోసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్లో వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌తో తప్పుడు ఫిర్యాదు చేయించి ఈ ఏడాది ఫిబ్రవరి 2న కేసు నమోదు చేసి వేధించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తమకు జరిగిన అన్యాయాన్ని దాని దృష్టికి తీసుకెళ్లింది. ఆగస్టు చివరి వారంలో విజయవాడకు వచ్చి పోలీసు కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేయగా.. ఏసీపీ స్రవంతి రాయ్‌కు విచారణ బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారంలో నాటి నిఘా చీఫ్‌ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, బెజవాడ పోలీసు కమిషనర్‌ కాంతి రాణా, డీసీపీ విశాల్‌ గున్నీ పేర్లు ఉండడంతో వారిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆ ముగ్గురితోపాటు ఏసీపీ హనుమంతరావు, అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణపై జెత్వానీ ఫిర్యా దు మేరకు ఇబ్రహీంపట్నంలో సెప్టెంబరు 14న కేసు నమోదైంది. విద్యాసాగర్‌ ఏ-1కాగా ముగ్గురు ఐపీఎ్‌సలు, ఇద్దరు పోలీసులు, మరో న్యాయవాది నిందితులుగా ఉన్నారు. కేసులో పెద్దలు ఉండడంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు దీనిని సీఐడీకి అప్పగించారు. సీఐడీ దర్యాప్తును వేగిరపరచింది.

విద్యాసాగర్‌ ఎందుకు టార్గెట్‌ చేశాడు..?

జెత్వానీ చెప్పిన అంశాలను రికార్డు చేసిన సీఐడీ అధికారులు.. ఆమెను కొన్ని వివరాలు అడిగారు. ‘ఇబ్రహీంపట్నంలో ఫిబ్రవరి 2న మీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుక్కల విద్యాసాగర్‌తో మీకున్న వైరం ఏంటి.. ఆయన్నుంచి మీకేమైనా వేధింపులు వచ్చాయా.. ఉద్దేశపూర్వకంగా ఎందుకు టార్గెట్‌ చేశాడు.. అంతకుముందు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది..’ అని ప్రశ్నించి.. కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం పోలీసులు సేకరించిన ఆధారాలతో ఆమె చెప్పిన వివరాలను పోల్చిచూస్తున్నట్లు తెలిసింది. ఇంకోవైపు.. విద్యాసాగర్‌ను కోర్టు తమ కస్టడీకి ఇస్తే సంధించాల్సిన ప్రశ్నలను సీఐడీ అధికారులు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత ఐపీఎ్‌సలను కూడా ప్రశ్నించనున్నట్లు సమాచారం.

Updated Date - Oct 31 , 2024 | 04:55 AM