శభాష్.. అభిషేక్
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:20 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం చట్రాపల్లి గ్రామంలో వరద బాధితుల పరిస్థితిని తెలుసుకునేందుకు యువ ఐఏఎస్ అధికారి,
అడవిలో 12 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వరద బాధితులకు పాడేరు ఐటీడీఏ పీవో పరామర్శ
చింతపల్లి, సెప్టెంబరు 11: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం చట్రాపల్లి గ్రామంలో వరద బాధితుల పరిస్థితిని తెలుసుకునేందుకు యువ ఐఏఎస్ అధికారి, పాడేరు ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ అటవీ ప్రాంతంలో ఏకంగా 12 కిలోమీటర్లకుపైగా కాలినడకన వెళ్లారు. ఆదివారం రాత్రి కురిసిన భారీవర్షాలకు చట్రాపల్లి గ్రామంపై వరద విరుచుకుపడింది. కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు ఆదివాసీలు వరదలో కొట్టుకుపోయారు. అందులో ఒక మహిళ మృతిచెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. చట్రాపల్లికి వెళ్లే మార్గంలో మూడుచోట్ల బ్రిడ్జిలు కొట్టుకుపోవడం, ఏడుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం చట్రాపల్లి గ్రామానికి వెళ్లాలని పాడేరు నుంచి జీకే వీధి చేరుకున్న పీవో సంపంగిగొంది వరకూ వాహనంలో వెళ్లారు. అక్కడ నుంచి సుమారు 12 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి సప్పర్ల చేరుకున్నారు. అక్కడి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు పండన్న, సుమిత్ర, సుబ్బారావును పరామర్శించారు. గిరిజనులతో కలిసి పునరావాస కేంద్రంలో పీవో భోజనం చేశారు. అక్కడనుంచి ద్విచక్ర వాహనంపై 2కిలోమీటర్ల దూరంలో ఉన్న చట్రాపల్లి వెళ్లారు.