సాయిరెడ్డి కుమార్తె అక్రమ నిర్మాణం తొలగింపు
ABN , Publish Date - Sep 05 , 2024 | 03:22 AM
హైకోర్టు ఆదేశాల దరిమిలా విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి భీమిలి సమీపాన బీచ్‌రోడ్డులో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు బుధవారమే తొలగించారు.
హైకోర్టు ఆదేశాలతో అధికారుల చర్యలు
2 వారాల్లో కోర్టుకు నివేదిస్తామని వెల్లడి
కూల్చివేతపై సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోండి
నేహారెడ్డికి హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
భీమునిపట్నం, సెప్టెంబరు 4: హైకోర్టు ఆదేశాల దరిమిలా విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి భీమిలి సమీపాన బీచ్‌రోడ్డులో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు బుధవారమే తొలగించారు. భీమిలి టౌన్ సర్వే నంబర్లు 1517, 1518, 1519, 1524లో దాదాపు మూడున్నర ఎకరాలను నేహారెడ్డికి చెందిన ‘అవ్యాన్’ సంస్థ కొనుగోలు చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డికి ఎదురులేకపోవడంతో తీరం వెంబడి కెరటాలను తాకేలా కాంక్రీటు ప్రహరీ గోడ నిర్మించారు. నిర్మాణాలను అనుమతించకూడదని జీవీఎంసీ అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోలేదు. దీనిపై జనసేనకు చెందిన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేయగా సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలంటూ జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిర్మాణాలను 24 గంటల్లోగా తొలగించాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామంటూ జీవీఎంసీ అధికారులు మంగళవారం నేహారెడ్డికి చెందిన కంపెనీకి నోటీసులు జారీచేశారు. వాటిని తీసుకునేందుకు సంస్థ ప్రతినిధులు నిరాకరించగా అధికారులు నోటీసును గోడకు అతికించారు. బుధవారం ఉదయానికి అటు నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. నిర్మాణాల తొలగింపుపై భీమిలి జోన్ ఏసీపీ దవళ శ్రీనివాసరావు మాట్లాడుతూ..హైకోర్టు ఉత్తర్వులు, జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలపై సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్న కట్టడాలను తొలగించామన్నారు. రెండు వారాల్లో చర్యల నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్టు)ను కోర్టుకు అందజేస్తామన్నారు.