కాదంబరి కేసులో ఆధారాలు భద్రపరచండి
ABN , Publish Date - Sep 05 , 2024 | 03:16 AM
ముంబై నటి కాదంబరి జెత్వానీపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఎలకా్ట్రనిక్ పరికరాలు, ఇతర ఆధారాలను భద్రపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
పోలీసులకు హైకోర్టు ఆదేశం.. విచారణ 11కు వాయిదా
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జెత్వానీపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఎలకా్ట్రనిక్ పరికరాలు, ఇతర ఆధారాలను భద్రపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. జెత్వానీపై నమోదు చేసిన కేసులో పోలీసులు సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఇతర ఎలకా్ట్రనిక్ పరికరాలను నిందితురాలికి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఉమ్మడి కృష్ణాజిల్లా, కోసూరుకు చెందిన కేవీఆర్ విద్యాసాగర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ ఫిర్యాదు ఆధారంగా జెత్వానీపై ఫిబ్రవరి 2న పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. జెత్వానీకి చెందిన మొబైల్ ఫోన్‌తో పాటు ఇతర ఆధారాలను పోలీసులు సీజ్ చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత పిటిషనర్‌ను నిందితుడిగా, జెత్వానీని బాధితురాలిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ నేపథ్యంలో ఆధారాలను భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. కేసు మొదటిసారి విచారణకు వచ్చిందని, వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ అభ్యర్థించారు.