ఏడాదిలో హామీలన్నీ నెరవేరుస్తాం
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:24 PM
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే నెరవేరుస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
దీపావళికి ఉచిత గ్యాస్
వృద్ధులకు ఉచిత వైద్య సదుపాయం
మంత్రి స్వామి
టంగుటూరు, అక్టోబర్ 1 : ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే నెరవేరుస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. మండలంలోని సూరారెడ్డిపాలెం, వల్లూరు ఎస్సీ కాలనీలో మంగళవారం నిర్వహించిన సామాజిక పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం నెలకు రూ.3వేలు పింఛన్ కేవలం మూడు నెలలు మాత్రమే ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే రూ.4వేలకు పెంచిందన్నారు. దివ్యాంగులకు రూ.3వేల నుంచి రూ.6వేలు చేసిందన్నారు. మంచంలో ఉండే వారికి రూ.15వేలు పింఛన్ చెల్లిస్తున్నట్లు మంత్రి వివరించారు. 2017లో టీడీపీ ప్రభుత్వంలోనే డప్పు కళాకారులకు, చర్మకారులకు పింఛన్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. 70 ఏళ్ల వయసు దాటిన వృద్ధులకు త్వరలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందించనున్నట్లు చెప్పారు. 1వ తేదీ నాడే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. 1వతేదీ సెలవు దినమైతే ముందు రోజునే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సూరారెడ్డిపాలెంలో సర్పంచ్ శైలిషా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మొలకలపల్లి కోటేశ్వరరావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్, వల్లూరులో టీడీపీ నాయకులు బొజ్జా శ్రీనివాసరావు, సుమన్, పవన్‌కుమార్, గోపి, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. పింఛన్‌ల పంపిణీ అనంతరం కొందరు లబ్ధిదారుల గృహాలకు వెళ్లి పరిశీలించారు. ఇళ్లు ఎప్పుడు నిర్మించుకున్నారు? ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం సాయం అందిస్తే ఇళ్లు నిర్మించుకుంటారా? అని వారిని అడిగి తెలుసుకున్నారు.
విచారణకు ఆదేశిస్తే స్వాగతిస్తాం
టంగుటూరు : తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదంపై విచారణకు సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్దను ఆదేశిస్తే స్వాగతిస్తామని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. పింఛన్‌ల పంపిణీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వివాదంలో సుప్రీంకోర్టు సోమవారం చేసిన వ్యాఖ్యలు కేవలం ప్రాథమిక స్థాయిలోనివేనన్నారు. న్యాయవ్యవస్థపై టీడీపీకి అపారమైన గౌరవం, నమ్మకం ఉన్నదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు ద్వారా నిజానిజాలన్నీ వెలుగు చూస్తాయని, దోషులు తప్పక శిక్షించబడతారని స్వామి వ్యాఖ్యానించారు.