విద్యుత్‌శాఖలో విజిలెన్స్ కలకలం
ABN , Publish Date - Sep 16 , 2024 | 01:35 AM
మండలంలో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో జరిగిన అవకతవకలపై ఇటీవల ఆశాఖ విజలెన్స్ అధికారులు నిర్వహించిన విచారణ కలకలం రేపింది.
ఏఈ, ఏఎల్‌ఎంలపై సస్పెన్షన్ వేటు
మర్రిపూడి, సెప్టెంబరు 15 : మండలంలో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో జరిగిన అవకతవకలపై ఇటీవల ఆశాఖ విజలెన్స్ అధికారులు నిర్వహించిన విచారణ కలకలం రేపింది. గుళ్ళసముద్రం గ్రామానికి చెందిన చంద్రమౌళి అనే వినియోగదారుడు ట్రా న్స్‌ఫార్మర్ ఏర్పాటులో ఏఈ రామకృష్ణారెడ్డి పలు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో ఒంగోలు విజిలెన్స్ డీఈ, దర్శి డీఈలు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. పలువురు గ్రామాల రైతుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో పెద్దఎత్తున ము డుపులు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని వినియోగదారులు కొంతమంది లిఖితపూర్వకంగా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఉన్నతాధికారులు ఏఈ రామకృష్ణారెడ్డి, ఏఎల్‌ఎం బాలకృష్ణారెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేశారు. పూర్తిస్థాయి విచారణ జరిగితే మరికొంత మంది క్షేత్రస్థాయి సిబ్బందిపై కూడా చర్య లు ఉంటాయని తెలుస్తోంది. పొదిలి ఏడీఏ శ్రీనివాసులుకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు దర్శి డీఈ కరీం తెలిపారు.