వాడీవేడిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:36 PM
చీరాల మున్సిపల్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. కౌన్సిలర్లు అరుపులు, కేకలకే ప్రాధాన్యత ఇచ్చారు.
కాసేపు అరుపులు, చమత్కారాలతో ముగింపు
ఒక్క అంశంపై గంట సేపు రసాబాసా
ఇదీ చీరాల మున్సిపల్ సర్వసభ్య సమావేశం తీరు
చీరాల, నవంబరు 29(ఆంధ్రజ్యోతి) : చీరాల మున్సిపల్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. కౌన్సిలర్లు అరుపులు, కేకలకే ప్రాధాన్యత ఇచ్చారు. కాసేపు కేకలు, కాసేపు చమత్కారాలతో సభ హుందాతనాన్ని తగ్గించారు. అజెండాలోని 15వ అంశంలో పొందుపరిచిన 29వ వార్డులోని ఓ డ్రైయిన్ నిర్మాణానికి సంబంధించిన చిన్న అంశంపై సుమారు గంటసేపు పాలక, ప్రతిపక్ష కౌన్సిలర్లు మధ్య రచ్చనడవడం గమనార్హం.
కమిషనర్ గారు.. మీరు రాజకీయ నాయకునిగా వ్యవహరించొద్దు
పట్టణంలో పలువురి విగ్రహాలకు ఏర్పాటుకు సంబంధించి చర్చ జరిగే సమయంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ కమిషనర్ గారు.. మీరు రాజకీయ నాయకుడిగా వ్యవహరించొద్దు.. పార్టీలు వేరైనా ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుంది.. ఎమ్మెల్యే సూచనలను తీసుకోండి.. అలాగే మాజీ మంత్రి పాలేటి రామారావు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఇచ్చిన అర్జీని అజెండాలో ఎందుకు పొందుపరచలేదు..? అబ్ధుల్ కలాం, వంగవీటి మోహనరంగా విగ్రహాలకు సంబంధించి నిర్ధిష్టంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదా అంటూ ఆక్షేపించారు. దీనిపై కమిషనర్ అబ్ధుల్‌రషీద్ స్పందిస్తూ తనపై ఆరోపణలు చేయవద్దని, అన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. వాటికి సంబంధించి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుందామని కౌన్సిలర్ల వాద, ప్రతివాదనల అనంతరం ఒక అంగీకారానికి వచ్చారు.
నేను చైర్మన్‌ని.. నువ్వు కౌన్సిలర్‌వి...
ప్రధానంగా 15వ అంశానికి సంబంధించి చర్చ సమయంలో కౌన్సిలర్ సత్యానందం, ఇతర కౌన్సిలర్లలో పలువురు పెద్ద, పెద్దగా మాట్లాడటంతో ఒకరి తరువాత ఒకరు మాట్లాడాలని చైర్మన్ చెప్పారు. ఆ క్రమంలో నేను లేస్తూనే ఉంటా.. మాట్లాడతానే ఉంటానంటూ సత్యానందం బిగ్గరగా చెప్పారు. నువ్వు లేస్తూనే ఉంటావు.. నేను కూర్చోవాలరి అంటూనే ఉంటా.. నువ్వు కౌన్సిలర్‌వి, నేను చైర్మన్‌ను ఆ విషయం గుర్తుంచుకోవాలని జంజనం చెప్పారు.
ఆరు అంగుళాల్లో డ్రైయిన్ కడతారా..
29వ వార్డులో డ్రైయిన్ నిర్మాణానికి సంబంధించి ఆ వార్డు కౌన్సిలర్ బత్తుల అనీల్ మాట్లాడుతూ ఆ ప్రాంతంలో ఉన్న మున్సిపల్ ప్లాన్ ప్రకారం అక్కడ రోడ్డు వెడల్పు 13.6 అడుగులు ఉందన్నారు. అందులో 13 అడుగుల రోడ్డు వేశారు. మిగిలిన ఆరు అంగుళాల్లో డ్రైయిన్ ఎలా కడతారని ప్రశ్నించారు. అక్కడ దశాబ్ధాలుగా వివాదం నడుస్తోందన్నారు. పలు నిధులకు సంబంధించి కౌన్సిలర్లు కీర్తి వెంకట్రావు, గుంటూరు ప్రభాకరరావు తదితరులు లేవనెత్తిన సమస్యలకు టీపీపీ శ్రీనివాసులు, డీఈ, కమిషనర్‌లు వివరణ ఇచ్చారు. అజెండాలోని మొత్తం అంశాలు 18 కాగా అందులో 4 అంశాలను వాయిదా వేశారు. 13 అంశాలను కొద్దిపాటి చర్చతో ఆమోదించారు. మంచినీటి కుళాయి పన్ను పెంపును అందరూ వ్యతిరేకించారు. ఆ అంశాన్ని పాత పద్దతిలో యధాతధంగా కొనసాగించాలని సవరిస్తూ ఆమోదించారు.