Share News

అలా వదిలేశారు!

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:29 PM

జిల్లా వైద్యారోగ్యశాఖలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఉద్యోగ నియామకాల్లో అప్పటి అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. ఒక్కో పోస్టుకు రేటు నిర్ణయించి అమ్ముకున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. అందులో విస్తుపోయే అనేక నిజాలు వెలుగు చూశాయి. స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉద్యోగాలు 41 మంది అనర్హులకు కట్టబెట్టినట్లు తేలింది.

అలా వదిలేశారు!
జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం

వైసీపీ హయాంలో 41 మందికి

నిబంధనలకు విరుద్ధంగా కొలువులు

రెండు నెలలపాటు విచారించి నివేదిక

సమర్పించిన అధికారుల కమిటీ

బుట్టదాఖలు చేసిన ఉన్నతాధికారులు

అందుకు ప్రతిగా భారీ మొత్తంలో

ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు

జిల్లా వైద్యారోగ్యశాఖలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఉద్యోగ నియామకాల్లో అప్పటి అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. ఒక్కో పోస్టుకు రేటు నిర్ణయించి అమ్ముకున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. అందులో విస్తుపోయే అనేక నిజాలు వెలుగు చూశాయి. స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉద్యోగాలు 41 మంది అనర్హులకు కట్టబెట్టినట్లు తేలింది. వారి పేర్లను కూడా విచారణ కమిటీ నివేదికలో పొందుపరిచి ఉన్నతాధికారులకు సమర్పించింది. కానీ ఇప్పటి వరకూ చర్యలు కరువయ్యాయి. ఉన్నత స్థాయిలో ఈ ఫైల్‌ను తొక్కిపెట్టినట్లు తెలుస్తోంది. అందుకోసం భారీ మొత్తంలోనే డబ్బులు చేతులుమారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒంగోలు (కలెక్టరేట్‌), సెప్టెంబరు 15 : వైద్యారోగ్యశాఖ అధికారులు గత వైసీపీ పాలనలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ఉద్యోగాలను సైతం అమ్ముకున్నారు. ముఖ్యంగా 2020లో కరోనా సమయంలో చేపట్టిన అత్యవసర నియామకాల్లో చేతివాటం చూపించారు. 300 పోస్టులకు పైగా భర్తీ చేసిన వారు అందులో కొన్ని పోస్టులను అనర్హులకు కట్టబెట్టారు. దీనిపై అటు కలెక్టర్‌కు, ఇటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

విచారణకు నలుగురు అధికారులతో కమిటీ

వైద్యారోగ్యశాఖలో ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై గత ఏడాది అక్టోబర్‌లో విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. అప్పటి జడ్పీ సీఈవో జాలిరెడ్డి నేతృత్వంలో నలుగురు అధికారులతో అప్పటి కలెక్టర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో రంగంలోకి దిగిన వారు జిల్లా వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ నాటి నుంచి నియామక పత్రాలు ఇచ్చేంత వరకూ జరిగిన నోట్‌ ఫైళ్లతోపాటు ఉద్యోగాల కోసం చేసిన దరఖాస్తులను కూడా పరిశీలించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారికి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉద్యోగాల కోసం చేసుకున్న దరఖాస్తులు కనిపించని పరిస్థితుల నుంచి నివేదిక ఇచ్చేంత వరకూ ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు గతేడాది డిసెంబరులో అప్పటి కలెక్టర్‌ దినే్‌షకుమార్‌కు విచారణ నివేదికను అందజేశారు. స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ నియామకాల్లో 41 మంది అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్లతో సహా నివేదికలో పొందుపర్చారు. విచారణ నివేదికను పరిశీలించిన అప్పటి కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ చర్యలు తీసుకోవాలని కోరుతూ వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు పంపారు. కానీ ఇప్పటి వరకూ చర్యలు కరువయ్యాయి. అయితే ఈ విచారణ నివేదికను వైద్యారోగ్యశాఖ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే ఒక అధికారి తొక్కిపెట్టినట్లు సమాచారం.

భారీగా చేతులు మారినట్లు ఆరోపణలు

విచారణ నివేదిక ఫైల్‌ను తొక్కిపెట్టడం వెనుక భారీగా చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. తమపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అప్పట్లో పనిచేసిన అధికారులతోపాటు, ఉద్యోగులు కూడా ఉన్నతాధికారులకు పెద్దమొత్తంలో మామూళ్లను సమర్పించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉద్యోగ నియాకాల్లో ముగ్గురు డీఎంహెచ్‌వోలతోపాటు ఆరుగురు కార్యాలయ ఉద్యోగుల పాత్ర ఉంది. వీరితోపాటు ఉద్యోగాలు పొందిన 41 మంది అనర్హులు కూడా కలిసికట్టుగా రాష్ట్రస్థాయిలోనే ఫైల్‌ నిలిచిపోయేలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

కూటమి ప్రభుత్వమైనా చర్యలు తీసుకొనేనా?

గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై కూటమి ప్రభుత్వంలోనైనా చర్యలు ఉంటాయా? లేదా? అన్న చర్చ నడుస్తోంది. ఇటీవల ఈ విషయం అధికార పార్టీ ముఖ్యనేత వద్ద చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీనిపై కూటమి నేతలు దృస్టి సారించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతోపాటు సంబంధిత మంత్రితో చర్చించి తదుపరి చర్యలు తీసుకొనేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:29 PM