సూపర్ బజారు సభ్యత్వ నమోదు సక్రమమే
ABN , Publish Date - Nov 30 , 2024 | 01:29 AM
ది ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ బజార్ (సూపర్ బజారు)లో నూతన సభ్యత్వాల నమోదుపై వైసీపీ నేతలకు కోర్టులో చుక్కెదురైంది. గతంలో పీఏసీ కమిటీ ఉండేది. అప్పట్లో కమిటీ చైర్మన్‌గా తాతా ప్రసాద్ ఉన్నారు.
కోర్టులో వైసీపీకి చుక్కెదురు
ఒంగోలు, కార్పొరేషన్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ది ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ బజార్ (సూపర్ బజారు)లో నూతన సభ్యత్వాల నమోదుపై వైసీపీ నేతలకు కోర్టులో చుక్కెదురైంది. గతంలో పీఏసీ కమిటీ ఉండేది. అప్పట్లో కమిటీ చైర్మన్‌గా తాతా ప్రసాద్ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించే దిశగా నూతన సభ్యత్వాల నమోదు ప్రక్రియను ఆయన చేపట్టారు. అందులో భాగంగా 2,551 మందిని సభ్యులుగా చేర్చారు. అప్పట్లో ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించే క్రమంలో వైసీపీకి చెందిన కాకర్ల వెంకట రమణయ్య, సరస్వతి బొట్ల, ఎస్.వెంకటరామయ్య, మార్టూరి శ్రీనివాసరావుతోపాటు మరికొందరు కొత్తగా చేపట్టిన సభ్యత్వ నమోదులు చెల్లవని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 11 సంవత్సరాలపాటు సాగిన వ్యాజ్యంపై ఎట్టకేలకు హైకోర్టు తీర్పును వెలువరించింది. నూతన సభ్యత్వాల స్వీకరణ సక్రమమేనని, వారంతా సూపర్‌బజార్ సభ్యులే నని తీర్పునిచ్చింది. దీనిపై తాతా ప్రసాద్ మాట్లాడుతూ గతంలో తాను త్రిసభ్య కమిటీ చైర్మన్‌గా ఉన్నపుడు సూపర్ బజార్ అభివృద్ధి కోసం నూతన సభ్యత్వాలు స్వీకరించామని తెలిపారు. మొత్తం 2,551 మందిని చేర్పించినట్లు చెప్పారు. అయితే దానిని అప్పటి వైసీపీ నాయకులు వ్యతిరేకించి కోర్టును ఆశ్రయించడంతో ఇన్ని రోజులు ఎన్నిక ఆగిందన్నారు. కోర్టు తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.