సిబ్బంది.. సామగ్రి
ABN , Publish Date - Sep 05 , 2024 | 01:19 AM
వరద బారిన పడిన విజయవాడ ప్రజలకు తొలి రెండు రోజులు పెద్దఎత్తున భోజనం, మంచినీరు, ఇతర ఆహార పదార్థాలను విభిన్నవర్గాల వారు పంపించగా బుధవారం మనుషులను, యంత్రాలను తరలిం చారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యల కోసం ప్రభుత్వపరంగా అవసరమైన సిబ్బంది, ఇతర పరికరాలను పంపిస్తు న్నారు.
వరద సహాయక చర్యలకు జిల్లా నుంచి విద్యుత్, పారిశుధ్య కార్మికుల తరలింపు
బాధితులకు ఉపశమన కార్యక్రమాల్లో మంత్రి డాక్టర్ స్వామి
ఒంగోలు, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : వరద బారిన పడిన విజయవాడ ప్రజలకు తొలి రెండు రోజులు పెద్దఎత్తున భోజనం, మంచినీరు, ఇతర ఆహార పదార్థాలను విభిన్నవర్గాల వారు పంపించగా బుధవారం మనుషులను, యంత్రాలను తరలిం చారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యల కోసం ప్రభుత్వపరంగా అవసరమైన సిబ్బంది, ఇతర పరికరాలను పంపిస్తున్నారు. విజయవాడను ముంచెత్తిన ఇటు కృష్ణమ్మ, అటు బుడమేరు కాస్తంత శాంతించాయి. వరద ఉధృతి తగ్గడంతో అక్కడి ప్రజలు బయటకు వస్తున్నారు. అక్కడ ఆహారం కన్నా ఇతర సహాయక చర్యలు అవసరం అధికంగా ఉంది. ప్రధానంగా విజయవాడను మురుగు ముంచెత్తింది. వరదతో కొట్టుకొచ్చిన మట్టి, ఇసుక ఎక్కడికక్కడ మేట వేశాయి. దీంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది మరోవైపు విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఈనేపథ్యంలో అక్కడ తక్షణం పారిశుధ్య చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల కోసం సంబంధిత సిబ్బంది, యంత్రాలు, ఇతర వస్తువులు భారీగా అవసరమయ్యాయి. దీంతో పొరుగు జిల్లాల నుంచి సిబ్బంది, మెటీరియల్‌ను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా జిల్లా నుంచి బుధవారం పారిశుధ్య కార్మికులు, విద్యుత్ సిబ్బంది, ట్రాక్టర్లు, జనరే టర్లు, ఇతర సామగ్రిని తరలించారు. వరద సహాయక చర్యల కోసం ఒంగోలు కార్పొరేషన్ నుంచి మంగళవారం 150 మందిని, బుధవారం మరో 150 మందిని పంపారు. అలాగే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల కోసం 120 మంది వివిధ స్థాయి అధికారులు, సిబ్బందిని ఇక్కడి విద్యుత్ శాఖ నుంచి పంపారు. మరో 50మందిని కూడా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 125 కేవీ సామర్థ్యం ఉన్న రెండు జనరేటర్లను బుధవారం ఎస్‌ఈ సత్యనారాయణ పంపారు.
జిల్లా నుంచి ట్రాక్టర్లు
విజయవాడలో సహాయక చర్యల కోసం జిల్లా నుంచి 50 ట్రాక్టర్లను పంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో యజమానులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడారు. తక్షణం 13 ట్రాక్టర్లను పంపారు. మిగిలిన వాటిని కూడా పంపనున్నట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల విజ్ఞప్తి మేరకు నగరంలోని క్విస్, పేస్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు పదివేల పులిహోర పొట్లాలను విజయవాడ వరద బాధితుల కోసం తరలించాయి. స్థానిక లాయర్‌పేటలోని షిర్డీసాయి కల్చరల్ మిషన్ తరపున ఆహార పదార్థాలు, మంచి నీటి బాటిళ్లను పంపారు. జిల్లాలోని పలు ప్రాంతాల వారు వరద బాధితుల సహా యార్థం ప్రభుత్వం ప్రకటించిన బ్యాంకు అకౌంట్లకు నగదు కూడా జమ చేస్తున్నారు. ఒంగోలు నుంచి కలెక్టర్ నేతృత్వంలో లక్షా 50వేల ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపారు.
సహాయక చర్యల్లో మంత్రి స్వామి
జిల్లాకు చెందిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి విజయవాడలోని వరద బాధిత ప్రజల సహాయక చర్యలలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అక్కడ నీట మునిగిన జక్కంపూడి, వైఎస్ కాలనీలకు ట్రాక్టర్‌లో వెళ్లి బాధితులను పరామర్శించారు. స్థానిక అధికారులు, సిబ్బందితో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆ సందర్భంగా ఒక అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సాయంతో రక్షించే చర్యలు తీసుకున్నారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆటోలో వెళ్లి బుడమేరుకు గండ్లుపడిన ప్రాంతాలను స్వామి పరిశీలించారు.