మెరుగైన సేవలతోనే ప్రజామన్ననలు
ABN , Publish Date - Oct 21 , 2024 | 10:51 PM
ప్రజలకు అధికారులు మెరుగైన సేవలు అందించి మన్ననలను పొందాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయం సమావేశపు హాలులో సోమవారం ఎమ్మెల్యే ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు.
అధికారులకు ఎమ్మెల్యే ఉగ్ర హితవు
ప్రజాదర్బార్‌లో భూ సమస్యలపై వెల్లువెత్తిన ఫిర్యాదులు
కనిగిరి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు అధికారులు మెరుగైన సేవలు అందించి మన్ననలను పొందాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయం సమావేశపు హాలులో సోమవారం ఎమ్మెల్యే ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై ఎమ్మెల్యేకు ఫిర్యాదులతో కూడిన వినతులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కనిగిరి అభివృద్ధిలో ముందుండాలనే తలంపుతో తాను కృషి చేస్తున్నామన్నారు. సమస్యలపై వచ్చే వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని హితవు పలికారు. అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యను వీలైనంతవరకు పరిష్కారమార్గం చూపాలన్నారు. సమస్య పరిష్కారం కాకుంటే రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఆర్టీసీ డోపో డౌన్‌లో ఉన్న వైన్‌షాపులను తొలగించాలని కోరుతూ మహిళలు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ విశ్వనాథరెడ్డి, ఎంపీడీవో హనుమంతరావు, మున్సిపల్ కమిషనర్ దానియేలు, పీఆర్ డీఈ శ్రీధర్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈ విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీపీ ప్రకాశం, ఎంఈవో నారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రజాదర్బార్‌లో భూసమస్యలపై వినతులు వెల్లువెత్తాయి. మొత్తం 207 అర్జీలు రాగా, వాటిల్లో 108కు పైగా భూ సమస్యలపై వచ్చినట్లు అధికారులు చెప్పారు.
హనుమంతునిపాడులో... హనుమంతునిపాడులో కూడా ఎమ్మెల్యే ఉగ్ర ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 170 వరకు వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందించారు.