జగనన్న కాలనీల్లో అక్రమాలు
ABN , Publish Date - Sep 05 , 2024 | 01:16 AM
ఇళ్లు లేని పేదలం దరికీ స్థలం ఇస్తామని గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్‌లలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. నివేశన స్థల పట్టాల పంపిణీలో ఆపార్టీకి చెందిన స్థానిక నాయకులు అధికారులను లోబర్చుకొని నిబంధనలకు విరుద్ధంగా పొజిషన్ సర్టిఫికెట్లు పొందారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల స్థలాలు పొందిన వైసీపీ నాయకులు
విక్రయించుకొని సొమ్ము చేసుకున్న వైనం
ఒకే ప్లాట్‌లో ఇద్దరికి పొజిషన్ చూపిన రెవెన్యూ అధికారులు
పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన బాధితులు
దొనకొండ, సెప్టెంబరు 4 : ఇళ్లు లేని పేదలం దరికీ స్థలం ఇస్తామని గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్‌లలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. నివేశన స్థల పట్టాల పంపిణీలో ఆపార్టీకి చెందిన స్థానిక నాయకులు అధికారులను లోబర్చుకొని నిబంధనలకు విరుద్ధంగా పొజిషన్ సర్టిఫికెట్లు పొందారు. అనంతరం వాటిని విక్రయించుకొని సొమ్ము చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు ఒకే నంబర్‌తో ఇద్దరికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం వివాదాస్పదమైంది.
ఒక్కో నాయకుడికి రెండేసి ప్లాట్లు
దొనకొండ సమీపంలోని ఇండ్లచెరువు గ్రామం మీదుగా మార్కాపురం వెళ్లే ప్రధాన రహదారి పక్కన 233/8 సర్వేనంబ ర్‌లో దాదాపు 70 ప్లాట్లతో జగనన్న లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. నిబంధనలకు అనుగుణంగా ఆన్‌లైన్ విధానం ద్వారా సగం మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు మంజూరు చేశారు. మిగిలిన వాటిలో స్థానిక వైసీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా మాన్యువల్ పద్ధతిలో బినామీ పేర్లతో ఒక్కొక్కరు రెండేసి ప్లాట్లకు పొజిషన్ సర్టిఫికెట్లు పొందినట్లు సమాచారం. అక్రమమార్గంలో ఇళ్ల పట్టాలు పొందిన వైసీపీ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా ఒక్కో ప్లాటు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు బహిరంగ మార్కెట్‌లో దర్జాగా విక్రయించుకొని సొమ్ము చేసుకున్నారని తెలుస్తోంది.
రుద్రసముద్రంలో..
మండలంలోని రుద్రసముద్రం గ్రామంలో మార్కాపురం వెళ్లే ప్రధాన రహదారి పక్కన సర్వేనెంబర్ 182లో దాదాపు 114 ప్లాట్లతో జగనన్న లేఅవుట్ ఏర్పాటు చేశారు. అందులో దాదాపు 95 మందికి పైగా అర్హులైన లబ్ధిదారులకు నిబంధనల మేరకు ఆన్‌లైన్ విధానంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మిగిలిన ప్లాట్లను స్థానిక వైసీపీ నాయకులు అప్పటి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెట్టించి నిబంధనలకు విరుద్ధంగా మాన్యువల్ పద్ధతిలో పొందారు. ఆతర్వాత వచ్చిన రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధుల సిఫార్సు మేరకు ఇద్దరు ముగ్గురు అర్హులైన లబ్ధిదారులకు రికార్డుపరంగా ప్లాట్ నంబర్లు వేసి ఇళ్ల స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేశారు. ముం దుగా వైసీపీ నాయకులకు ఇచ్చిన స్థలాల నంబర్‌లు ఆన్‌లైన్‌లో లేకపోవడంతో వాటినే మరికొందరికి కేటాయించారు. లబ్ధిదారులు ప్లాట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టబోగా అదే ప్లాట్ నంబర్లతో పొజిషన్ సర్టిఫికెట్లు పొందిన వైసీపీ నాయకులు వారిపై దౌర్జన్యం చేసి నిర్మాణం చేపట్టకుండా అడ్డగించారు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు విచారించి ఇద్దరి వద్ద ఉన్న ఇళ్ల ప్లాట్ల పొజిషన్ సర్టిఫికెట్లలో ఏది నకిలీ, ఏది ఒరిజనల్ అన్నది ధ్రువీకరించాలని తహసీల్దార్ కార్యాలయానికి పంపారు.
తహసీల్దార్ కార్యాలయం చుట్టూ బాధితుల ప్రదక్షిణలు
రుద్రసముద్రంలో సమస్య పరిష్కారం కోసం బాధితులు నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు అక్రమాలకు అండగా నిలవగా, ప్రస్తుత అధికారులు చోద్యంచూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.