పొదిలిలో ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:27 AM
ఎట్టకేలకు పొదిలిలో రోడ్డు అంచులు, కాలువ లపై ఆక్రమించుకున్న దుకాణాలు షెడ్లను నగర పంచాయతీ అధికారులు మంగళవారం కూల్చి వేశారు.
పొదిలి, అక్టోబరు 1 : ఎట్టకేలకు పొదిలిలో రోడ్డు అంచులు, కాలువ లపై ఆక్రమించుకున్న దుకాణాలు షెడ్లను నగర పంచాయతీ అధికారులు మంగళవారం కూల్చి వేశారు. డ్రైనేజ్ కాలువ లు ఆక్రమించడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ దుర్వాసన వెదజల్లుతోందని, పలు మార్లు ఫిర్యాదులు చేశారు. అయినా అధికారులు చూస్తాం, చేస్తాం అంటూసమాధానం చెప్పారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుల నారాయణరెడ్డి వార్డులకు వచ్చినప్పుడు ప్రజలు ప్రధానరోడ్డు పరిస్థితిని వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పొదిలి రహదారులు వెడల్పు చేసేందుకు చర్యలు తీసుకుంటానని ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి నగరపంచాయతీ అధికారులు దగ్గర ఉండి ఎక్స్‌కవేటర్ల సహాయంతో ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం మొదలుపెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పొదిలి అభివృద్ధిపై దృష్టిపెట్టడంపై ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. అదేవిధంగా పట్టణంలో కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు కోరుతున్నారు. అయితే మూడురోజులుగా అక్రమణల్లో ఉన్నవారిని స్వయంగా తొలగించుకోవాలని నగరపంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు సిబ్బందితో తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా తొలగింపు పనులకు శ్రీకారం చుట్టారు. మార్కాపురం అడ్డరోడ్డు నుంచి మర్రిపూడి అడ్డరోడ్డు వరకు తొలగింపు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.