కేజీబీవీ పోస్టులకు భారీ డిమాండ్
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:04 AM
జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్టు పోస్టులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ పోస్టులు కేవలం 2024-25 విద్యా సంవత్సరానికి మాత్రమేనని నోటిఫికేషన్‌లో పేర్కొన్నా అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు చేశారు.
51 కొలువులకు 1,930 దరఖాస్తులు
ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలన
ఒంగోలు విద్య, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్టు పోస్టులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ పోస్టులు కేవలం 2024-25 విద్యా సంవత్సరానికి మాత్రమేనని నోటిఫికేషన్‌లో పేర్కొన్నా అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు చేశారు. జిల్లాలోని 38 కేజీబీవీల్లో బోధన, బోధనేతర పోస్టులు ఉండగా 1,930 మంది దరఖాస్తు చేశారు. 42 బోధన పోస్టులకు 1,331, తొమ్మిది బోధనేతర పోస్టులకు 599 దరఖాస్తులు అందాయి. బోధన పోస్టుల్లో ఒక ప్రిన్సిపాల్ పోస్టుకు 128 మంది, రెండు పీటీటీ పోస్టులకు 46, నాలుగు ఇంగ్లీషు పోస్టులకు 69, ఆరు గణితం పోస్టులకు 259, ఐదు పీఎస్ పోస్టులకు 103, మూడు ఎస్‌ఎస్ పోస్టులకు 223 మంది దరఖాస్తు చేసుకున్నారు. మూడు సోషల్ పోస్టులకు 190, పీజీటీ ఫిజిక్స్ రెండు పోస్టులకు 34, రెండు కెమిస్ట్రీ పోస్టులకు 42, రెండు బోటనీ పోస్టులకు 47, రెండు జువాలజీ పోస్టులకు 43, రెండు జీఎఫ్‌సీ పోస్టులకు నాలుగు, ఎనిమిది పార్ట్‌టైం టీచర్ పోస్టులకు 143, బోధనేతరంలో మూడు వార్డెన్ పోస్టులకు 312, ఆరు అకౌంటెంట్ పోస్టులకు 287 దరఖాస్తులు వచ్చాయి. కాంట్రాక్టు పోస్టులకు పెద్దఎత్తున దరఖాస్తులు రావడం నిరుద్యోగ సమస్య తీవ్రతకు దర్పణం పడుతోంది. ట్రిపుల్ ఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థినులు కూడా ఈ పోస్టుల కోసం పోటీ పడుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన వారు అర్హత లేకపోవడంతో వారు వెనుతిరగాల్సి వచ్చింది. ఒక్కో పోస్టుకు ఐదుగురు చొప్పున మెరిట్ అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. సోమవారంతో సర్టిఫికెట్ల పరిశీలన ముగిసింది.