పకడ్బందీగా పథకాల అమలు
ABN , Publish Date - Nov 30 , 2024 | 11:48 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించాలన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశంలో వారు పాల్గొన్నారు.
సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు
ఒంగోలు కార్పొరేషన్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించాలన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశంలో వారు పాల్గొన్నారు. మంత్రి స్వామి మాట్లాడుతూ జాతీయ రహదారులకు సంబంధించి తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణాలను, తాగునీటి పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సీసీ రోడ్లు, సైడు కాలువల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తాం : ఎంపీ మాగుంట
సమావేశానికి అధ్యక్షత వహించినఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష చేస్తామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి మంజూరు చేసిననిధులను మండలాలు, గ్రామాల అభివృద్ధికి కేటాయించాలని సూచించారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ జిల్లాలో లఖ్‌పతి దీదీ పథకం విజయవంతంగా అమలవుతున్నదన్నారు. సౌర విద్యుత్ వినియోగం పెరిగేలా సూర్యఘర్ పథకాన్ని జిల్లాలోని 5లక్షల ఇళ్లకు విస్తరించడంపై దృష్టి సారించాలన్నారు.
ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలు ఇవీ..
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ నగరానికి పశ్చిమం వైపు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని కోరారు. అమృత్ పథకం కింద చేపట్టిన పనులు పూర్తి చేస్తే ఒంగోలుకు ప్రతి రోజూ తాగునీరు ఇవ్వొచ్చన్నారు.
సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ పేర్నమిట్ట వద్ద ఉన్న చెరువును అమృత్ పథకంలో చేర్చాలని కోరారు. గుండ్లకమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు సంబంధించి రెండు మోటార్లు పనిచేయడం లేదని, కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ ఎన్‌హెచ్ 656 జాతీయ రహదారిలో మగ్గంపల్లి వద్ద లైట్స్ పనిచేయకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని సమావేశం దృష్టికి తెచ్చారు. తాగునీటి పథకాలకు సంబంధించి కొత్త పైపులైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాల్సిన అవసరం ఉందని తెలిపారు.
గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మాణ ఆవశ్యకతను వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డీఆర్వో చినఓబులేషు, జడ్పీ సీఈవో చిరంజీవి, సీపీవో వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులతోపాటు ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.