ముందుగానే పింఛన్ల పండుగ
ABN , Publish Date - Nov 30 , 2024 | 11:46 PM
పింఛన్ల పండుగ ముందే వచ్చింది. ఊరూవాడా మురిసింది. వృద్ధులు, దివ్యాంగులు, వింతంతువులు, ఇతరత్రా పింఛన్ లభ్ధిదారుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కొండంత ‘భరోసా’ లభించింది. ప్రతి నెలా ఒకటో తేదీన ఠంచన్‌గా పింఛన్ సొమ్ము చేతిలో పడుతోంది. ఆరోజు సెలవు దినమైతే ముందుగానే అందుతోంది. డిసెంబరు ఒకటో తేదీ ఆదివారం కావడంతో శనివారమే జిల్లావ్యాప్తంగా పింఛన్‌ల పంపిణీ కోలాహలంగా సాగింది.
కోలాహలంగా పంపిణీ
ఉదయం ఆరు గంటల నుంచే ప్రారంభం
నెన్నూరుపాడులో పాల్గొన్న మంత్రి స్వామి
ఇతర ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు,
అధికారుల భాగస్వామ్యం
పింఛన్ల పండుగ ముందే వచ్చింది. ఊరూవాడా మురిసింది. వృద్ధులు, దివ్యాంగులు, వింతంతువులు, ఇతరత్రా పింఛన్ లభ్ధిదారుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కొండంత ‘భరోసా’ లభించింది. ప్రతి నెలా ఒకటో తేదీన ఠంచన్‌గా పింఛన్ సొమ్ము చేతిలో పడుతోంది. ఆరోజు సెలవు దినమైతే ముందుగానే అందుతోంది. డిసెంబరు ఒకటో తేదీ ఆదివారం కావడంతో శనివారమే జిల్లావ్యాప్తంగా పింఛన్‌ల పంపిణీ కోలాహలంగా సాగింది. ఉదయం ఆరు గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సొమ్మును అందజేశారు. ఎక్కడికక్కడ టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు భాగస్వామ్యమయ్యారు. రాత్రి 8 గంటలకు సుమారు 2.66 లక్షల మందికి రూ.113.51 కోట్లు (93.04శాతం) అందజేశారు.
ఒంగోలు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా ఆరో నెల పింఛన్ల పంపిణీ జిల్లాలో అట్టహాసంగా సాగింది. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన చేపట్టే ఈ కార్యక్రమాన్ని ఈసారి ఒక రోజు ముందుగానే ప్రారంభించారు. డిసెంబరు 1వ తేదీ ఆదివారం రావడంతో నవంబర్ 30నే పంపిణీ చేశారు. అదేసమయంలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. అర్హత కలిగిన వారి నుంచి డిసెంబరులో దరఖాస్తులు తీసుకొని జనవరి నుంచి కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
2.66 లక్షల మందికి పంపిణీ
జిల్లాలో ప్రత్యేకించి తూర్పుప్రాంతంలో తుఫాన్ ప్రభావంతో చలి వాతావరణం, చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ పలుచోట్ల శనివారం ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ మొదలైంది. కొండపి మండలం నెన్నూరుపాడులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి లాంఛనంగా ప్రారంభించారు. మద్దిపాడు మండలం మారెళ్లగుంటపాలెంలో ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ పంపిణీ చేశారు. దర్శి పట్టణంలో చేపట్టిన పింఛన్‌ల పంపిణీలో ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పాపారావుతో కలిసి పాల్గొన్నారు. త్రిపురాంతకం మండలం ముడివేములలో టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు పంపిణీ చేశారు. ఇతర అన్ని పట్టణాలలోని వార్డులు, గ్రామాలలో స్థానిక అధికార పార్టీ నాయకులు, అధికారులు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో 2.86 లక్షల మందికి సుమారు రూ.122 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా రాత్రి 8 గంటలకు సుమారు 2.66 లక్షల మందికి రూ.113.51 (93.04శాతం) కోట్లు అందజేశారు.
ఒంగోలులో పాల్గొన్న టీడీపీ ప్రజాప్రతినిధులు
ఒంగోలులో నిర్వహించిన దిశ సమావేశంలో పాల్గొన్న అనంతరం పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నగరంలోని సంతపేటలో పింఛన్‌ల పంపిణీకి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.