వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
ABN , Publish Date - Sep 12 , 2024 | 01:23 AM
ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కు పోలీసు స్టేషన్‌లో చేదు అనుభవం ఎదురైంది. మండలంలోని సిద్దెనపాలెంలో మంగళవారం రాత్రి బీసీ సామాజికవర్గానికి చెందిన టీడీపీ మద్దతు దారులు తమ కులదైవం ఊరేగింపు చేస్తున్నారు.
దేవుడి ఉత్సవాన్ని అడ్డుకున్న వైసీపీ నేత
కేసు విచారణకు పిలిచిన పోలీసులు
అతనికి మద్దతుగా స్టేషన్‌కి వెళ్లిన తాటిపర్తి
నిలదీసిన ఆ నాయకుడి బాధితులు
పుల్లలచెరువు, సెప్టెంబరు 11: ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కు పోలీసు స్టేషన్‌లో చేదు అనుభవం ఎదురైంది. మండలంలోని సిద్దెనపాలెంలో మంగళవారం రాత్రి బీసీ సామాజికవర్గానికి చెందిన టీడీపీ మద్దతు దారులు తమ కులదైవం ఊరేగింపు చేస్తున్నారు. అదే సమయంలో తమ బజారుకు రావొద్దని గడ్డం సుబ్బయ్య అనే వైసీపీ నాయకుడు ఆయన వర్గంతో కలిసి అడ్డుకుని ఇష్టారీతిన దాడి చేశాడు. బాధితుల సమాచారం మేరకు ఎస్‌ఐ బాబూరావు గ్రామానికి వెళ్లి గొడవను అడ్డుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. వైసీపీ నాయకుల దాడిపై బుధవారం ఉదయం టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కోసం సుబ్బయ్యను స్టేషన్‌కు పిలిచారు. విషయం తెలుసుకున్న ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పుల్లలచెరువు స్టేషన్‌కు వచ్చి తమ పార్టీ నాయకుడికి మద్దతుగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు అక్రమమని నినదించారు. అక్కడే ఉన్న సిద్దెనపాలెం గ్రామానికి చెందిన టీడీపీ మద్దతుదారులు ఎమ్మెల్యేను నిలదీశారు. గత ఐదేళ్లుగా గడ్డం సుబ్బయ్య చేసిన అక్రమాలను మహిళలు వీడియోల ఆధారాలతో చూపించారు. గ్రామంలో సుబ్బయ్య చేసిన అకృత్యాలను ఒక్కొక్కటిగా ఆయనకు వివరించారు. గ్రామాన్ని తాకట్టు పెట్టి ముటుకుల సొసైటీలో రుణం తీసుకున్నట్లు ఆరోపించారు. గ్రామానికి చెందిన ఓసీ కుటుంబాలను రూ.10లక్షల ఇస్తేనే ఉండండి, లేదంటే ఊరు విడిచి వెళ్లమని కొట్టినా అప్పటి పోలీసులు పట్టించుకోకుండా సుబ్బయ్యకే మద్దతు పలికారని మండిపడ్డారు. టీడీపీ మద్దతుదారుల బోర్లను విరగ్గొట్టి లోపల పడేశాడని, ఆయన అక్రమాలు అన్నీ వినాలని మహిళలు వరుసపెట్టి చెబుతుండగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ కంగుతిని ఏమి మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి తిన్నగా జారుకున్నారు.