వరదలో వికృత రాజకీయం
ABN , Publish Date - Sep 05 , 2024 | 04:07 AM
విజయవాడ, పరిసర గ్రామాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా వచ్చిన వరదలకు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
తప్పుడు ప్రచారంతో వైసీపీ మూక రాక్షసానందం
ఏకంగా బంగ్లాదేశ్ వరద ఫొటోను బుడమేరుకు పులిమేశారు
జగన్ బాటలోనే వైసీపీ బ్యాచ్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
విజయవాడ, పరిసర గ్రామాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా వచ్చిన వరదలకు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పగలూ, రాత్రీ నిర్విరామంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, అధికారులు బాధితులను ఆదుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వైసీపీ మూక వికృత రాజకీయం చేస్తోంది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టు వైసీపీ అధ్యక్షుడు జగన్.. చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేసినట్టుగానే వైసీపీ బ్యాచ్ రెచ్చిపొతోంది. ఎక్కడో బంగ్లాదేశ్‌లో ఇటీవల వరదలు సంభవించినప్పటి ఫొటోను బుడమేరుకు పులిమేశారు. బంగ్లాదేశ్ పౌరుడు ఒకరు అక్కడ వరదల తీవ్రతను వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్టు చేశారు. వైసీపీ సానుభూతిపరుడు అదే ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి బుడమేరు వరదల వల్ల సంభవించినట్టు కామెంట్ చేశాడు. ‘వరద ముప్పు తగ్గాక బుడమేరు గురించి చాలా చర్చ జరగాలి. కరకట్ట సేఫ్టీ కోసం బుడమేరు గేట్లు తెరిచారని చర్చ. అదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద చరిత్రహీనుడు అవుతాడు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ పోస్టు చేశాడు. విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా జగన్.. చంద్రబాబు ఇంటికి, బుడమేరు వరదలకు లింక్ పెట్టి పొంతలేని ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ వరద ఫొటో పెట్టి విమర్శలు చేసిన వైసీపీ సానుభూతిపరుడు కూడా జగన్‌ను ఫాలో అయినట్టు ఉన్నాడు. జగన్ పర్యటన సందర్భంగా ఓ మహిళ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ఆయన మొహం మీదే మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే విజయవాడ ముంపు ప్రాంతాల్లో మంచినీళ్లు దొరకడం లేదని, బిస్కెట్లు మాత్రమే ఇస్తున్నారని వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు అదేపనిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం చేస్తున్నవారంతా చాలా ‘ఫ్రెష్’గా కనిపిస్తున్నారు.