ఖాతా.. కంగారు!
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:40 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు రాయితీ సొమ్మును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేందుకు అవసరమైన జాతీ య చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ)ని ఖాతాలకు అనుసంధానం చేయడంపై క్షేత్రస్థాయిలో అపో హలు, సందేహాలు విస్తృతం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు పోస్టాఫీసులకు ఎగబడుతు న్నారు.
ఎన్‌పీసీఐకి అనుసంధానం కాని అక్కౌంట్లు 1.61 లక్షలు
పునరుద్ధరణకు అవకాశమున్నా కొత్త ఖాతాల కోసం పోస్టాఫీసుల్లో రద్దీ
సచివాలయాల్లో ఎన్‌పీసీఐ లింక్ కాని లబ్ధిదారుల జాబితాలు
ఏలూరు అర్బన్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు రాయితీ సొమ్మును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేందుకు అవసరమైన జాతీ య చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ)ని ఖాతాలకు అనుసంధానం చేయడంపై క్షేత్రస్థాయిలో అపో హలు, సందేహాలు విస్తృతం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు పోస్టాఫీసులకు ఎగబడుతు న్నారు. బ్యాంకు లేదా పోస్టాఫీసు పొదుపు ఖాతాకు ఎన్‌పీసీఐ అనుసంధానమైతేనే ప్రభుత్వ పథకాల రాయితీ సొమ్ము జమ అవుతుందని కొంతకాలం క్రితమే ప్రభుత్వం ప్రకటించినా రానున్న కొద్దిరోజుల వ్యవధిలోనే రాష్ట్రప్రభుత్వం నుంచి రాయితీ నిధులు లబ్ధిదారుల ఖాతాలకు జమ కానున్నట్టు ప్రచారం జరగడంతో ఒక్క సారిగా రద్దీ కొన్నిరెట్లు పెరగడానికి కారణమైంది. జిల్లాలో ప్రస్తుతం ఆర్థికలావాదేవీలు కొనసాగుతూ లైవ్‌లోవున్న బ్యాంకు, పోస్టాఫీసు మొత్తం పొదుపు ఖాతాల్లో 1.61 లక్షలు ఎన్‌పీసీఐకి అనుసంధానం కాలేదని ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) జిల్లా మేనేజర్ రాజేశ్ శనివారం వెల్లడించారు. ఈ ఖాతాలను తిరిగి లావాదేవీలకు పనికి వచ్చేలా లైవ్‌లోకి తీసుకురావాలంటే సంబంధిత బ్యాంకుకు ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీని తీసుకెళ్ళి, కొంత నగదు మొత్తాన్ని జమచేసిన తర్వాత అభ్యర్థన పత్రాన్ని అందజేస్తే నిబంధనల మేరకు ఖాతాను మళ్ళీ లైవ్‌లోకి తీసుకొస్తారు. అలాకాకుంటే కొత్తగా బ్యాంకు పొదుపు ఖాతాను తెరవాలనుకుంటే బ్యాంకు నిబంధనలు, షరతులను బట్టి రూ.500ల నుంచి రూ.2వేలు చెల్లించి, అవసరమైన ధ్రువపత్రాలు, అభ్యర్థన దరఖాస్తును అందజేస్తే కొత్త ఖాతాను తెరుస్తారు. అంతమొత్తాన్ని చెల్లించే స్థోమతలేని వారికి రూ.200 చెల్లింపుతో పోస్టాఫీసులో కేవలం ఆధార్ కార్డు వివరాలు, వేలిముద్ర తీసుకుని పేపర్‌లెస్ పద్ధతిన అక్కడికక్కడే కొత్తఖాతాను తెరిచే వీలుండటంతో కొద్దిరోజులుగా ప్రజలు పోస్టాఫీసులకు బారులు తీరుతున్నారు.
సచివాలయాల్లో ఎన్‌పీసీఐ లింక్ కాని లబ్ధిదారుల జాబితాలు
జిల్లాలోని అన్ని సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు, కార్యదర్శులకు వారి పరిధిలో ఎన్‌పీసీఐకి అనుసంధానం కాని లబ్ధిదారుల వివరాలను ఇప్పటికే ప్రభుత్వం పంపించింది. కనీసం పదిమంది ఖాతాలకు ఎన్‌పీసీఐ అనుసంధానం చేయాల్సి ఉంటే అక్కడికే పోస్ట్‌మ్యాన్‌ను పంపించి లింక్ చేయించే వెసులుబాటు కల్పించారు. అయినప్పటికీ తమ బ్యాంకు పొదుపు ఖాతాలు లైవ్‌లో ఉన్నదీ, లేనిదీ పరిశీలించుకోకుండానే ప్రజలు అపోహలతో పోస్టాఫీసులకు వెల్లువెత్తుతున్నారని తపాలా అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు ప్రస్తుతం వున్న బ్యాంకు ఖాతాలు ప్రభుత్వ రాయితీ సొమ్మును పొందేందుకు పనికిరావని పోస్టాఫీసులో కొత్తగా ఖాతాను తెరవాల్సిందేనని చేస్తున్న దుష్ప్రచారం కూడా పోస్టాఫీసుల్లో రద్దీ అమాంతం పెరగడానికి కారణంగా తెలుస్తోంది.
పోస్టాఫీసులకు రానక్కర్లేదు..
బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాలు పని చేస్తుంటే ఎన్‌పీసీఐకి అనుసంధానం అయి వున్నట్టే. ఈ విషయం తెలియక చాలా మంది గ్రామాల నుంచి పోస్టాఫీసులకు వస్తున్నారు. జిల్లాలో ఎన్‌పీసీఐకి లింక్‌కాని 1.61 లక్షల ఖాతాల్లో పదేళ్ల లోపు వయస్సు వున్న పిల్లలు, ఇతరప్రాంతాలకు వలస వెళ్ళిపోయినవారు, ఇక్కడకువచ్చిన వలస ప్రజలు, చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. ఇటువంటివారి ఖాతాలను అనుసంధానం చేయడం సాధ్యం కాదు. ప్రజలు ముందు గా తమ పరిధిలోని సచివాలయా నికి వెళ్ళి అక్కడి జాబితాలో ఉన్నదీ, లేనిదీ పరిశీలిం చుకోవాలి. బ్యాంకు ఖాతా ఉంటే సంబంధి త బ్యాంకుకు వెళ్ళి నిబంధనల మేరకు ఖాతాను పునరుద్ధరించుకుంటే సరిపోతుంది. కొత్తగా పోస్టాఫీసు పొదుపు ఖాతా అవసరమనుకున్న వారు మాత్రమే సచివాలయ వెల్ఫేర్ అసిస్టెం ట్ లేదా కార్య దర్శికి తెలిపితే స్థానిక పోస్ట్ మాస్టర్ దృష్టికి తీసుకెళ్లి అక్కడికే పోస్ట్‌మ్యాన్ ను పంపించి ఖాతాను తెరిపిస్తారు. ఇందుకు రూ.200 మినహా అదనంగా చెల్లించనవసరం లేదు. ఎన్‌పీసీఐకి అనుసంధానం చేసి పాత పోస్టల్ ఖాతాను పునరుద్ధరించడానికి ఎటువంటి రుసుం పోస్ట్‌మ్యాన్‌కు చెల్లించనక్క ర్లేదు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వ పథకాల రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తున్నారన్నది అవాస్తవం. గత ఐదు రోజుల్లో జిల్లావ్యాప్తంగా మూడు వేల ఖాతాలను ఎన్‌పీసీఐకి అనుసంధానం చేశాం.
– రాజేశ్, మేనేజర్, ఐపీపీబీ, ఏలూరు