నీటి సంఘాల ఎన్నికలకు మోగిన నగారా
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:49 AM
జిల్లాలో నీటి సంఘాల ఎన్నికలకు నగారా మోగింది. నవంబరు 20న నోటిఫికేషన్ వెలువడనుంది. దీనికి ముందు ఓటర్ల జాబితా సవరణలు, తుది ఓటర్ల జాబితా ప్రచురణ నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు 29 రోజుల షెడ్యూల్‌ను జలవనరుల శాఖ విడుదల చేసింది.
-షెడ్యూల్ విడుదల చేసిన జలవనరుల శాఖ
-ఉమ్మడి జిల్లాలో ఎన్‌ఎస్‌పీ కింద 17 డీసీలు, 106 నీటి వినియోగ సంఘాలు
- డెల్టాలో 32 డీసీలు, 220 నీటి సంఘాలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
జిల్లాలో నీటి సంఘాల ఎన్నికలకు నగారా మోగింది. నవంబరు 20న నోటిఫికేషన్ వెలువడనుంది. దీనికి ముందు ఓటర్ల జాబితా సవరణలు, తుది ఓటర్ల జాబితా ప్రచురణ నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు 29 రోజుల షెడ్యూల్‌ను జలవనరుల శాఖ విడుదల చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సాగు నీటి సంఘాలను నిర్వీర్యం చేసింది. సాగునీటి సంఘాలు, ప్రాజెక్టు కమిటీ పదవీకాలం ముగిసిన తర్వాత వాటి గురించి పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవ్వడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉమ్మడి కృష్ణాజిల్లా సాగు నీటి పరంగా రెండు విధాలుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధి మేజర్ ఇరిగేషన్‌గా ఉంది. ప్రకాశం బ్యారేజ్ దిగువ నుంచి ఉన్న ప్రాంతం డెల్టాగా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్‌ఎస్‌పీ ఎడమ కాల్వ పరిధిలో 3.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, దీని కింద 17 డిసి్ట్రబ్యూషన్ కమిటీ(డీసీ)లు, 106 సాగునీటి సంఘాలు ఉన్నాయి. ఇది కాకుండా ఒక ప్రాజెక్టు కమిటీ ఉంది. దీని ప్రధాన కార్యాలయం నూజివీడులో ఉంది. తూర్పు డెల్టా పరిధిలో 7.39 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 58వేల ఎకరాల ఆయకట్టు ఏలూరు జిల్లాలో ఉంది. ఈ డెల్టా పరిధిలో 220 సాగునీటి సంఘాలు, 32 డీసీలు ఉన్నాయి. ఈ మొత్తం ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను నవంబరు 13న ప్రచురిస్తారు. 20న నోటిఫికేషన్, 21 నుంచి 23 వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. 24 నుంచి 26 వరకు డీసీలకు, 27 నుంచి 29 వరకు ప్రాజెక్టు కమిటీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ ఎన్‌ఎస్‌పీ ఎడమ కాల్వ రెండు జోన్లుగా ఉంది. జోన్-1లో జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామలో సగభాగం ఉండగా, జోన్-2లో నూజివీడు, గన్నవరం, మైలవరం, నందిగామలో మరికొంత భాగం ఉన్నాయి. నీటి సంఘాలకు ఎన్నికైన సభ్యులు నీటి వినియోగ సంఘాల అధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ నీటి వినియోగ సంఘాలు డిసి్ట్రబ్యూటరీ కమిటీలను ఎన్నుకుంటాయి. ఈ డీసీలన్నీ కలిపి ప్రాజెక్టు కమిటీని ఎన్నుకుంటాయి. ఎన్టీఆర్ జిల్లాలో నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి పులిచింతల ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీరామకృష్ణను నోడల్ అధికారిగా నియమించారు.