ఏమిటిదంతా? ఏం చేస్తున్నారు మీరంతా?
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:28 AM
ఏమిటిదంతా? మీరంతా ఏం చేస్తున్నారు? మీ శాఖ పరిధిలో జైళ్లలో ఏం జరుగుతోందో తెలుసుకొనే బాధ్యత మీకు లేదా?
వెంకటరెడ్డికి జైల్లో రాజభోగాలపై సీఎం చంద్రబాబు సీరియస్
అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘ఏమిటిదంతా? మీరంతా ఏం చేస్తున్నారు? మీ శాఖ పరిధిలో జైళ్లలో ఏం జరుగుతోందో తెలుసుకొనే బాధ్యత మీకు లేదా? అవినీతితో రాష్ట్రాన్ని దోచుకొన్నవాళ్లు అందులో నాలుగు రూపాయలు విసిరేస్తే జైళ్లలో ఏం కావాలంటే అది జరిగిపోతుందా? మీపై నమ్మకంతో బాధ్యత అప్పగిస్తే ఇలాగేనా చేసేది?’ అని జైళ్ల శాఖ ఉన్నతాధికారిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో అరెస్టయిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి విజయవాడ జైల్లో రిమాండ్‌లో ఉన్న సమయంలో అధికారులు రాజభోగాలు సమకూర్చారని ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వార్తను చూసిన ఆయన ఆ శాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు. నారావారిపల్లిలో తన సోదరుడి దశ దిన కర్మలకు హాజరైన చంద్రబాబు... శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయానికి వచ్చారు. పత్రికలో వార్తను చూసిన ఆయన దీనిపై తనకు తక్షణమే నివేదిక ఇవ్వాలని, అలాగే జైళ్ల శాఖ డీజీ విశ్వజిత్, నిఘా విభాగం అధిపతి లడ్డాను పిలిపించాలని ఆదేశాలు జారీ చేశారు.
వారిద్దరూ కలిసే సమయానికే సీఎంకు ప్రాథమిక నివేదిక అందింది. వెంకటరెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆయన గదిలో కొత్త టీవీ, కొత్త ప్రిజ్ ఏర్పాటు చేశారని, జైలు కోసం దాతలు ఇచ్చిన వాటిని అధికారులు వెంకటరెడ్డి గదిలో పెట్టారని ఆ నివేదికలో పేర్కొన్నారు. అలాగే కోర్టు అనుమతి లేకపోయినా బయటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి జైలు అధికారులు అనుమతించారని తెలిపింది. బయటి నుంచి వెంకటరెడ్డి భోజనం తెప్పించుకోవడానికి కోర్టు అనుమతి ఉందా అని సీఎం ప్రశ్నించడంతో లేదని విశ్వజిత్ అంగీకరించారు. ఎవరి ప్రమేయంతో ఈ వ్యవహారం జరిగిందో తనకు పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా, జగన్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న సమయంలో అక్కడ పనిచేసిన ఒక అధికారి ప్రస్తుతం విజయవాడ జైల్లో ముఖ్య బాధ్యతల్లో ఉన్నారని, వైసీపీ నేతలతో ఆయనకున్న సాన్నిహిత్యం వెంకటరెడ్డికి ఉపయోగపడిందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ఆగ్రహం నేపథ్యంలో ఆ శాఖలో ఒకరిద్దరిపై వేటు పడే సూచనలున్నాయి.