నేడు మిలాద్ ఉన్ నబీ
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:51 PM
ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈద్-ఏ-మిలాద్-ఉన్-నబీ పర్వదిన వేడుకలు సోమవారం వైభవంగా జరగనున్నాయి.
ముస్తాబైన మసీదులు
కొలిమిగుండ్ల, సెప్టెంబరు 15: ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈద్-ఏ-మిలాద్-ఉన్-నబీ పర్వదిన వేడుకలు సోమవారం వైభవంగా జరగనున్నాయి. ఇందు కోసం పట్టణాలు, పల్లెల్లోని మసీదులు, దర్గాలు సుందరంగా ముస్తాబయ్యాయి. ఈ సందర్భంగా ముస్లింలు ర్యాలీలు, అన్నదాన కార్యక్రమాలు, మత పెద్దల బోధనల కోసం ఏర్పాట్లు చేశారు.
మిలాద్ ఉన్ నబీ విశిష్టత
మహమ్మద్ ప్రవక్త జన్నదినాన్నే కొన్ని ముస్లిం తెగలు ఈద్-ఏ-మిలాద్-ఉన్-నబీగా జరుపుకొంటారు. ఇస్లామిక్ క్యాలెండరు ప్రకారం మూడో నెల రబీ అల్-అవ్వల్ 12వ రోజున ముస్లింలు ఈ పర్వదినాన్ని గుర్తించి వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబరు 15 సాయంత్రం నుంచి ప్రారంభం కాగా సోమవారం సాయంత్రం ముగుస్తుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ముస్లింలు వేడుకలు నిర్వహించడానికి సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా నూతన దుస్తులు ధరించి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం ర్యాలీలు, సహపంక్తి భోజనాలు, అన్నదానం చేయడం ఆనవాయితీ.