Share News

ఆర్‌యూలో టైం స్కేల్‌ వివాదం

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:06 AM

ఆర్‌యూలో టైం స్కేల్‌ వివాదం ముదురుతోంది. ఉద్యోగుల జీత, భత్యాలకు వర్సిటీ నిధులు వెచ్చించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆర్‌యూలో టైం స్కేల్‌ వివాదం

ఉద్యోగుల జీత, భత్యాలకు వర్సిటీ నిధులు

ఫైనాన్స్‌ అప్రూవల్‌ లేని టైం స్కేల్‌ను రద్దు చేయాలి

లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘాలు

కర్నూలు(అర్బన్‌), సెప్టెంబరు 15: ఆర్‌యూలో టైం స్కేల్‌ వివాదం ముదురుతోంది. ఉద్యోగుల జీత, భత్యాలకు వర్సిటీ నిధులు వెచ్చించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రాయలసీమ యూనివర్సి టీ ఏర్పాటై దాదాపు 15 సంవత్సరాలవుతున్నా ఇప్పటి వరకు నాన్‌ టీచింగ్‌ విభాగానికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్‌ లేకుండా పోయింది. కానీ ప్రస్తుతం వర్సిటీలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు దాదాపు 250 మంది ఉన్నట్లు వర్సిటీ రికార్డులు సూచిస్తున్నాయి. అందులో 110 మంది టైం స్కేల్‌ ఉద్యోగులు, ప్రభుత్వ అనుమతి లేని 13 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, తాజాగా వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న మరో 11 మంది నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. వర్సిటీ అధికారులు తమ స్వార్థం కోసం పదవీ కాలంతో పబ్బం గడుపుకోవడానికి విచ్చలవిడిగా ముడుపులు తీసుకొని అడ్డగోలుగా ఉద్యోగాలు కట్టబెట్టారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకపోయినా 110 మందిని టైం స్కేల్‌ ఉద్యోగులుగా గుర్తించడం, వారికి ప్రభుత్వ అనుమతి లేకున్నా ఇతర అలవెన్సులు వర్తింపజేయడం..అది కూడా యూనివర్సిటీ నిధుల నుంచి జీతాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. వీటిపైన విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున ఉద్యమాలకు తెరలేపాయి. తక్షణమే టైం స్కేల్‌ రద్దు చేయాలని, విద్యార్థుల సొమ్మును విద్యార్థుల డెవలప్‌మెంట్‌ కోసం ఉపయోగించకుండా ఉద్యోగుల జీత, భత్యాలకు ఎలా ఉపయోగిస్తారని విద్యార్థి సంఘాలు ఇటీవల లోకాయుక్తలో ఫిర్యాదు చేశాయి. వసతి గృహాల్లో ఇద్దరు సూపర్‌ వైజర్లను ఉద్యోగులుగా చేర్చుకుని రెండు ఏళ్లలోపే వారికి టైం స్కేల్‌ వర్తింప జేయడం గతంలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. టైం స్కేల్‌ను రద్దు చేసి వర్సిటీలో ఉద్యోగులకు నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఇటీవల రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను వినతి పత్రం ద్వారా మంగళగిరిలో జరిగిన ప్రజా దర్బార్‌లో కోరారు. ఉద్యోగులకు సీఎఫ్‌ఎంఎస్‌తో సంబంధం లేకుండా ఇంటర్నల్‌గా జీతాలు వర్సిటీ నిధుల నుంచి ఇవ్వడంతో ప్రతి సంవత్సరం రూ.3 కోట్లకు పైగా ఖజానా నుంచి ఇస్తున్నారు. దీన వల్ల వర్సిటీ అఽభివృద్ధి కుంటుపడుతోంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీ ఖజాన ఖాళీ కాకుండా, నోటిఫికేషన్‌ భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

టైం స్కేల్‌ను తక్షణమే రద్దు చేయాలి

తక్షణమే టైం స్కేల్‌ను రద్దు చేసి వర్సిటీ ఖజానకు గండి పడకుండా చర్యలు తీసుకోవాలి. ఇదే విషయంపై ఇటీవల లోకాయు క్తకు కూడా ఫిర్యాదు చేశాం. నోటిఫికేష్‌ ద్వారా నియమకాలు చేపట్ట కుండా గత ఉపకులపతులు, అఽధికారులు నియామకాలు చేపట్టడం ఎంత వరకు సమంజసం. ప్రభుత్వ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే వర్సిటీ ఖజాన నుంచి జీత, భత్యలు ఇవ్వడం అంటే విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించడమే. విద్యార్థులు చెల్లించిన ఫీజుల ద్వారా వర్సిటీలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేయాల్సింది పోయి సిబ్బందికి ఎలా వేతనాలు ఇస్తారు.

- రాగిరి చంద్రప్ప, రాష్ట్ర అధ్యక్షుడు టీఎస్‌ఎఫ్‌

Updated Date - Sep 16 , 2024 | 12:06 AM