Share News

కౌన్సిల్‌లో రచ్చ రచ్చ

ABN , Publish Date - Nov 29 , 2024 | 11:38 PM

ఎమ్మిగనూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం రసాభాసాగా ముగిసింది. టీడీపీ, వైసీపీ సభ్యులు పోటాపోటీగా పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేయటంతో కౌన్సిల్‌లో గందరగోళం ఏర్పడింది.

కౌన్సిల్‌లో రచ్చ రచ్చ
సమావేశంలో టీడీపీ, వైసీపీ సభ్యుల వాగ్వాదం

పోటాపోటీగా పోడియం ముందు బైఠాయింపు

ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన కౌన్సిల్‌ సభ్యులు

ఎమ్మిగనూరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం రసాభాసాగా ముగిసింది. టీడీపీ, వైసీపీ సభ్యులు పోటాపోటీగా పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేయటంతో కౌన్సిల్‌లో గందరగోళం ఏర్పడింది. శుక్రవారం మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం చైర్మన్‌ డా. రఘు అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే ఒకటో వార్డు కౌన్సిలర్‌ నాగేశప్ప మాట్లాడుతూ గత కౌన్సిల్‌ సమావేశంలో చైర్మన్‌ పట్ల టీడీపీ కౌన్సిలర్‌ దురుసుగా వ్యవహరించారని, ఇది సరైంది కాదని, క్షమాపణ చెప్పాలని కోరాడు. దీంతో టీడీపీ కౌన్సిపల్‌ దయాసాగర్‌తోపాటు ఆ పార్టీ కౌన్సిలర్లు సమాధానం ఇచేందుకు ప్రయత్నించారు. చైర్మన్‌ డా. రఘు కల్పించుకొని అజెండాలోని అంశాలు చదివిన తరువాత మాట్లాడాలని చెప్పడంతో టీడీపీ సభ్యులు శాంతించారు. అటు తరువాత అంజెండాలోని రెండు, మూడు అంశాలు చదువుతుండగానే వైస్‌ చైర్మన్‌ నజీర్‌ అహ్మద్‌ లేచి అజెండాలోని అంశాలను ఆమోదిస్తున్నామన్నారు. ఆ తరువాత టీడీపీ కౌన్సిలర్‌, ఫ్లోర్‌ లీడర్‌ దయాసాగర్‌ మాట్లాడుతూ గత కౌన్సిల్‌ సమావేశంలో ఆరో వార్డు వైసీపీ సభ్యుడు శివకుమార్‌ టీడీపీ మహిళా కౌన్సిలర్ల మనోభావాలు కించపరిచేలా మాట్లాడారని, ఆయన క్షమాపణ చెప్పాలని కోరారు. వైస్‌ చైర్మన్‌ నజీర్‌ అహ్మద్‌ అడ్డు తగులుతూ చైర్మన్‌ను టీడీపీ సభ్యుడే కించపరిచేలా మాట్లాడారని, ఆయన ముందు క్షమాపణ చెప్పాలని అనటంతో టీడీపీ, వైసీపీ సభ్యుల మద్య వాగ్వాదం చెలరేగింది. చైర్మన్‌ రఘు ఒకరి తరువాత ఒకరు మాట్లాడాలని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఆయన మాటను వైసీపీ సభ్యులు పట్టించుకోకపోగా చైర్మన్‌ పోడియం ముందు బైఠాయించి క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ పోడియం ముందు బైఠాయించారు. ఇరువురు సభ్యులు పోటా పోటీగా బైఠాయించి నినాదాలు చేశారు. నినాదాలు, అరుపులతో కౌన్సిల్‌ సమావేశం దద్దరిల్లింది. దీంతో కౌన్సిల్‌ సమావేశంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇరువురిని శాంతింపజేసేందుకు చైర్మన్‌ డా. రఘు ప్రయత్నించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. పోటాపోటీగా నినాదాలు చేయటంతో చేసేదిలేక బెల్‌ కొట్టి సమావేశాన్ని ముగించారు. పోడియం దిగివస్తున్న చైర్మన్‌ను ఇలా ఎలా సమావేశాన్ని ముగిస్తారని ప్రశ్నించటంతో చైర్మన్‌ స్పందిస్తూ ఎవరు మాట వినకపోవటంతో ఏమి చేయాలి.. ఎలా కొనసాగించాలన్నారు. ఇదిలాఉంటే ప్రజా సమస్యలు గాలికొదిలేసి ఒకరిని ఒకరు విమర్శించుకోవడమే సరిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ దివ్యకళ, కౌన్సిలర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి, డీఈ, ఏఈ, ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.

కౌన్సిల్‌ సమావేశంలో మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ దయాసాగర్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పట్టణ ప్రజలకు తాగునీరు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏఐఐబీ స్కీంను తిరిగి తీసుకోచ్చారన్నారు. అలాగే శివారు కాలనీల్లో తాగునీటి పైప్‌లైన్లు వేసేందుకు రూ.2.65కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించటం, టెక్స్‌టైల్‌ పార్కుతో పాటు ఇతర పథకాలను అసెంబ్లీలో మాట్లాడి తీసుకు రావటం పట్ల కౌన్సిల్‌ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

వైస్‌ చైర్మన్‌ నజీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ పట్టణంలోని మిలటరీ కాలనీ రోడ్డును కోసిగి రోడ్డుకు కలపాలని, గోనేగండ్ల సర్కిల్‌లో ఎమ్మిగనూరు స్థల దాత హసన్‌ బేగ్‌ స్థూపం నెలకొల్పాని కోరారు. అలాగే మిలటరీ కాలనీకి వెళ్లే రోడ్డుకు మాజీ ఎమ్మెల్యే చెన్నకేవరెడ్డి పేరు పెట్టాలని కోరారు.

Updated Date - Nov 29 , 2024 | 11:38 PM