టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:10 AM
రాష్ట్ర స్థాయి 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాల, బాలికల టేబుల్ టెన్నిస్ పోటీలు శనివారం నంద్యాలలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
నంద్యాల, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయి 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాల, బాలికల టేబుల్ టెన్నిస్ పోటీలు శనివారం నంద్యాలలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీనాథ్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమానికి నంద్యాల ఎంఈవో శివరామప్రసాద్, రాష్ట్ర అండర్-14 టేబుల్ టెన్నిస్ పరిశీలకుడు దుర్గా ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గౌరవాధ్యక్షుడు నిమ్మకాయల సుధాకర్, రాష్ట్ర అధ్యక్షుడు ఏపీరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల నుంచి 150మంది క్రీడాకారులు, 50మంది అఫీషియల్స్, కోచ్‌లు పోటీల్లో పాల్గొనేందుకు వచ్చారు. అతిథులు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలన్నారు. పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరచిన క్రీడాకారులను జాతీయ స్థాయి స్కూల్‌గేమ్స్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేంద్ర, నాగరాజు, టోర్నమెంట్ టెక్నికల్ అడ్వైజర్ విశ్వనాథ్, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.