Share News

ప్రతి ఇంటా సోలార్‌ వెలుగులు

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:18 AM

కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సూర్య ఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటికి 200 యూనిట్లు సోలార్‌ పవర్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తాం. రూ.75 వేల వరకు రాయితీ వస్తుంది.

ప్రతి ఇంటా సోలార్‌ వెలుగులు

గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్‌ ప్రాజెక్టుల నిర్మాణం

ఓర్వకల్లు పారిశ్రామిక వాడ అభివృద్ధికి పెద్దపీట

కర్నూలులో హైకోర్టు బెంచ్‌

కరువు, వలసల నివారణకు ప్రత్యేక ప్రణాళిక

పుచ్చకాయలమడ ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు

లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ

కర్నూలు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి)/పత్తికొండ: ‘కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సూర్య ఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటికి 200 యూనిట్లు సోలార్‌ పవర్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తాం. రూ.75 వేల వరకు రాయితీ వస్తుంది. పేదలు భరించాల్సిన లబ్ధిదారుని వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుంది, ఆర్థికంగా ఉన్నవాళ్లు 300 సోలార్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో భాగంగా మంగళవారం పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో లబ్ధిదారులు తలారి గంగమ్మ, చింతకాయల వెంకటేశ్‌ ఇళ్లకు వెళ్లి పింఛన్‌ డబ్బులు అందజేశారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాసేపు గడిపారు. అనంతరం రూ.2.63 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో వెలసిన కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్‌ హరిత, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన ప్రజా వేదిక, పేదల సేవలో కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ‘సూపర్‌ సిక్స్‌లో భాగంగా వృద్ధుల పింఛన్‌ రూ.4వేలు, దివ్యాంగుల పింఛన్‌ రూ.6 వేలకు పెంచాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేశాం. మెగా డీఎస్సీలో భాగంగా 16,300 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నాం. దీపావళి నుంచి ‘ఇంటింట దీపం’ వెలిగించాలన్న లక్ష్యంగా మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వబోతున్నాం’ అని సీఎం వివరించారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో మిత్రుడు పవన్‌ కళ్యాణ్‌, బీజేపీతో కలిసి కూటమిగా ముందుకు సాగుతున్నామని వివరించారు. గత జగన్‌ ప్రభుత్వం చేసిన అరాచకాలు, విధ్వంసాలు అన్నీఇన్నీ కావని, వాటిని ఒక్కొక్కటిగా సరి చేస్తూ, పాలనను గాడిలో పెడుతున్నామని చంద్రబాబు వివరించారు.

ఆ మూడు ప్రాజెక్టులు నిర్మిస్తాం

గత టీడీపీ ప్రభుత్వంలో పత్తికొండ, డోన్‌, ఆలూరు, పాణ్యంలో చెరువులకు హంద్రీనీవా ద్వారా చెరువులను నింపే పథకానికి శ్రీకారం చుట్టాం. గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్‌, కేసీ కాలువ ప్రాంత అభివృద్ధికి నడుం బిగిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక గంపెడు మట్టిని తీయలేదని చంద్రబాబు అన్నారు. ఆర్డీఎస్‌, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను నిర్మిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లాలో కరువు వలసల నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వివరించారు. ఓర్వకల్లు ఇండస్ర్టియల్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నాడు విజన్‌ 2020తో ముందుకెళ్లామని, నేడు విజన్‌-2047 లక్ష్యంగా ముందుకెళ్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దేందుకు ముందుకెళ్తున్నామని చెప్పారు. ఓర్వకల్లు పారిశ్రామిక అభివృద్ధిని 2,850 ఎకరాల విస్తీర్ణంలో చేపడతామని, రూ.3వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తే దాదాపు 12వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు వివరించారు. రాయలసీమను గ్రీన్‌హబ్‌గా అభివృద్ధి చేసి 7 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని వివరించారు. రాయలసీమలో అన్ని జిల్లాలు సాగు నీటి ప్రాజెక్టులు నిర్మాణానికి అనుకూలంగా ఉన్నాయని, కర్నూలు జిల్లాకు ఒక్కటే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఎకరాకు నీరందించే ప్రణాళిక తయారు చేస్తామని స్పష్టం చేశారు.

పత్తికొండ నుంచి ఎమ్మెల్యేలుగా ఆ ముగ్గురు

‘పత్తికొండ నుంచి కేఈ ప్రభాకర్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కేఈ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా ఈ ప్రాంతానికి సేవలు చేశారు. ఈ ఎన్నికల్లో కేఈ శ్యాంబాబును గెలిపించారు. అలాగే ఎంపీటీసీగా ఉన్న బస్తిపాటి నాగరాజును ఎంపీ టికెట్‌ ఇచ్చి గెలిపించాం. అది టీడీపీకి ఉన్న పేదలపై ఉన్న ప్రేమ అని’ చంద్రబాబు తెలిపారు. టీడీపీలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని, జెండా మోసేవారికే భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పార్టీలో మధ్యవర్తులు ఉండరని వివరించారు. జనవరి నుంచి పీ-4 పాలసీ (ప్రైవేటు, ప్రభుత్వం, ప్రజలు, పార్ట్‌నర్‌షిప్‌)తో పాలసీ అమలుకు శ్రీకారం చుడతామన్నారు.

చంద్రన్నకు ఘన స్వాగతం:

జిల్లా పర్యటనలో భాగంగా పుచ్చకాయలమడ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌, కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా, ఎస్పీ జి. బిందుమాధవ్‌, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి. ఆదోని టీడీపీ ఇన్‌చార్జి కే. మీనాక్షినాయుడు, టీడీపీ సీనియర్‌ నాయకుడు సాంబశివారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, శాలివాహన కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, ఆలూరు, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జిలు వీరభద్రగౌడు, రాఘవేంద్రరెడ్డి, టీడీపీ నాయకులు రమాకాంత్‌ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు పేరుపేరునా వారిని ఆప్యాయంగా పలకరించారు. నాయకులు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. అంతకుముందు మధ్యాహ్నం 12.35 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి, డోన్‌, పాణ్యం, కోడుమూరు, నందికొట్కూరు ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి, గిత్తా జయసూర్య, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర సీడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ధర్మవరం సుబ్బారెడ్డి, టీడీపీ సీనియర్‌ నాయకులు మాండ్ర శివానందరెడి, ఎదురూరు విష్ణువర్ధన్‌ రెడ్డి, నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, జాయింట్‌ కలెక్టర్‌ బి. నవ్య చంద్రబాబుకు స్వాగతం పలికారు. అనంతరం సీఎంకు వినతి పత్రం అందజేశారు.

Updated Date - Oct 02 , 2024 | 12:18 AM