Share News

ప్రైవేట్‌ మద్యం షాపులకు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:14 AM

ప్రైవేట్‌ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ పి. శ్రీదేవి అన్నారు.

ప్రైవేట్‌ మద్యం షాపులకు నోటిఫికేషన్‌
మాట్లాడుతున్న ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌

కర్నూలు(అర్బన్‌), అక్టోబరు 1 : ప్రైవేట్‌ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ పి. శ్రీదేవి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి కర్నూలులో 99, నంద్యాలలో 105 మద్యం దుకాణాలకు సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తులు ఈ నెల 9వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు. 11న కర్నూలు జిల్లాకు జిల్లా పరిషత్‌లో, నంద్యాల జిల్లాలకు నంద్యాల కలెక్టరేట్‌లో డిప్‌ తీస్తామని వెల్లడించారు. డిప్‌లో ఎంపికైన వారికి రెండు సంవత్సరాల కాలపరిమితితో దుకాణాలు కేటాయించబడతాయని చెప్పారు. అందుకుగాను నిర్దేశించిన ఫీజును స్పాట్‌లోనే చెల్లించి 12న దుకాణాలు తెరవాల్సి ఉంటుందని తెలిపారు. ఒక్కో దుకాణానికి ఒకరు ఎన్ని దరఖాస్తులైనా, ఏ జిల్లాలోనైనా చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. ఫీజు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని, ఆ ఫీజు రిఫండ్‌ కాదని, గుర్తుంచుకుని దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కర్నూలులో 91 దుకాణాలకు రూ. 65 లక్షలు, 8 దుకాణాలకు రూ. 55 లక్షలు, నంద్యాల జిల్లాలో 44 దుకాణాలకు రూ. 65 లక్షలు, 61 దుకాణాలకు రూ. 55 లక్షలు ఏడాదికి ఫీజు ఉంటుందని తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలో 5 కి.మీ., మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో 2 కి.మీ. పరిధిలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని, మండలం పరిధిలోనైతే ఏ గ్రామంలోనైనా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. గీత కార్మికులకు పది శాతం దుకాణాలు కేటాయించామని, త్వరలో మార్గదర్శకాలు వెలువడతాయని తెలిపారు. ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా చెల్లించిన టోకెన్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని నేరుగా డిప్‌ కేంద్రానికి వెళ్లవచ్చని, ఆఫ్‌లైన్‌ ద్వారా చెల్లించిన డీడీలను స్థానిక ఎక్సైజ్‌ స్టేషన్స్‌లో కౌంటర్లలో ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. సమావేశంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ హనుమంతరావు, సూపరింటెండెంట్‌ సుధీర్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:14 AM