రహదారి పనుల పరిశీలన
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:49 PM
జాతీయ రహదారి 340 పనులను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, నేషనల్ హైవే పీడీ పద్మజ శుక్రవారం పరిశీలించారు.
నందికొట్కూరు రూరల్/ జూపాడుబంగ్లా, నవంబరు29 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారి 340 పనులను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, నేషనల్ హైవే పీడీ పద్మజ శుక్రవారం పరిశీలించారు. నందికొట్కూరు మండలంలోని నందికొట్కూరు, బొల్లవరం, దామగట్ల, బ్రాహ్మణకొట్కూరు పొలాల మీదుగా వెళుతున్న జాతీయ రహదారి పనులను నంద్యాల జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, పీడీ పద్మజ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ ఈ జాతీయ రహదారి నిర్మాణం వల్ల రైతుల పొలాలకు వెళ్లే రహదారులు మూసుకు పోయాయని, దీని వల్ల రైతులు తమ పొలాలకు వెళ్లడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని జేసీ దృష్టికి తీసుకుని వెళ్లారు. స్పందించిన జేసి విష్ణుచరణ్ మాట్లాడుతూ రైతుల రస్తా సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళతానని అన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు తహసీల్దార్ శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ వీరం ప్రసాదరెడ్డి, బ్రాహ్మణకొట్కూరు మాజీ సింగింల్ విండో చైర్మన్ మద్దూరు హరిసర్వోత్తమరెడ్డి, ఖలీలుల్లా బేగ్ పాల్గొన్నారు.
జూపాడుబంగ్లా మండలంలో...
జూపాడుబంగ్లా మండలం తాటిపాడు వద్ద రెండురోజుల కిందట రైతులు జాతీయ రహదారి పనులను అడ్డుకోవడాన్ని శుక్రవారం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పరిశీలించారు. సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని, లేకపోతే రైతులం కిలోమీటర్ల పొడవున పొలాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్‌నాయక్, రైతులు ఖాజీకురైషన్, రవికుమార్‌యాదవ్, మన్సూర్‌బాషా, జిన్నుబాసా, మాలిక్‌బాషా పాల్గొన్నారు.