వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:37 AM
ఆధునిక కాలంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా నూతన సాంకేతిక విధానాలను అనుసరిస్తూ ఫొటో, వీడియోగ్రాఫర్లు తమ వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ
కర్నూలు(కల్చరల్), సెప్టెంబరు 4: ఆధునిక కాలంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా నూతన సాంకేతిక విధానాలను అనుసరిస్తూ ఫొటో, వీడియోగ్రాఫర్లు తమ వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు. బుధవారం నగర శివారు పెద్దపాడు రోడ్డులోని రాజ్ ఫంక్షన హాలులో జిల్లా ఫొటో, వీడియోగ్రాఫర్స్, డిజైనర్స్, ఎడిటర్స్, అలైడ్ సర్వీసెస్ అసోసియేషన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంక టేశ, కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హాజరయ్యారు. ముందుగా ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేశ మాట్లాడుతూ దేశంలో వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయని, అయితే కులాలకు అతీతంగా ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ వృత్తులు వచ్చాయని చెప్పారు. ఛాయా చిత్రాలకు పూర్వం చిత్రలేఖనం ఉండేదని, ఆ తర్వాత ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీలు వచ్చాయని, ఆధునిక పరిజ్ఞానంతో ఈ రంగం రోజురోజుకూ విస్తరిస్తోందని తెలిపారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఫొటో, వీడియోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. అనంతరం ఫొటోగ్రాఫర్లు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషనను పరిశీలించి వారిని అభినందించారు.