Share News

ఎమ్మిగనూరు మార్కెట్‌కు భారీగా పంట ఉత్పత్తులు

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:53 PM

వేలాది బస్తాల పంటఉత్పత్తులు విక్రయానికి రైతులు తరలించటంతో ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కిటకిటలాడింది.

ఎమ్మిగనూరు మార్కెట్‌కు భారీగా పంట ఉత్పత్తులు
వ్యవసాయ మార్కెట్‌లో విక్రయానికి వచ్చిన వేరుశనగ

ఎమ్మిగనూరు, సెప్టెంబరు 15: వేలాది బస్తాల పంటఉత్పత్తులు విక్రయానికి రైతులు తరలించటంతో ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కిటకిటలాడింది. వచ్చిన వేరుశనగ, ఆముదాల బస్తాలను ఎక్కడ దించాలో తెలియక రైతులు, కమీషన్‌ ఏజెంట్లు ఇబ్బందులు పడ్డారు. మార్కెట్‌కు ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూడు, గూడూరు తదితర ప్రాంతాలనుంచి రైతులు పెద్ద ఎత్తున వేరుశనగను తరలించారు. 24040 బస్తాలు(7212క్వింటాళ్లు) వేరుశనగ, 887 ఆముదాల సంచులు (444క్వింటాళ్లు) మొత్తం 24927 బస్తాలు విక్రయానికి మార్కెట్‌కు రైతులు తీసుకొచ్చారు. దీంతో మార్కెట్‌ పంట ఉత్పత్తులతో కిక్కిరిసింది. దీనికి తోడు మరో ఐదారు వేల బస్తాలు వచ్చినప్పటకీ మార్కెట్‌లో విక్రయానికి పెట్టేందుకు స్థలం లేకపోవటంతో రైతులు గోడౌన్లలో నిలువ చేసి వెళ్లినట్లు సమాచారం. 24927బస్తాలు రావటంతో సరుకును ఎక్కడ విక్రయానికి ఉంచాలో తెలియక కమీషన్‌ ఏజెంట్లు నానా ఇబ్బందులు పడాడ్డారు. స్థలం లేకపోవటంతో కొంతమంది ఏజెంట్లు మార్కెట్‌లో ఉన్న రహదారి పక్కన, టెండర్‌ హాల్‌ ముందు ఉన్న రహదారిలో అమ్మకానికి పెట్టారు. ప్రధానంగా మార్కెట్‌ వెనుక భాగంలో టీఎంసీలో కూరగాయల హోల్‌సెల్‌ దుకాణాలు ఉండటంతో అక్కడ పంట ఉత్పత్తులు విక్రయించే అవకాశం లేకపోయింది. అంతేగాక పెద్దఎత్తున సరుకు రావటంతో టెండరు సైతం ఆలస్యం అయింది. కాగా ఆదివారం మార్కెట్‌ కమిటీలో వేరుశనగ క్వింటం గరిష్ఠ ధర రూ. 7,180, కనిష్ఠ ధర రూ. 2200, ఆముదాలు క్వింటం గరిష్ఠ ధర రూ.5682, కనిష్ఠ ధర రూ.4530 పలికింది. మార్కెట్‌ కమిటీకి ఊహించనంతగా పెద్దఎత్తున పంట ఉత్పత్తులు రావటంతో సరుకు తెచ్చిన వాహనాలతో మార్కెట్‌ దగ్గర ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవటంతో మార్కెట్‌కు సరుకు తెచ్చిన రైతులు, వాహనదారులు, కమీషన్‌ ఏజెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Sep 15 , 2024 | 11:53 PM