ఘాటు తగ్గిన పచ్చిమిర్చి
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:55 AM
జూలైలో పచ్చిమిర్చి ఽధరలు ఆకాశన్నంటాయి.
50 కేజీల బస్తా రూ.600
జూలైలో రూ.2,600, సెప్టెంబరులో రూ.600
రుద్రవరం, సెప్టెంబరు 15: జూలైలో పచ్చిమిర్చి ఽధరలు ఆకాశన్నంటాయి. సెప్టెంబరులో మాత్రం పూర్తిగా ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆదివారం పచ్చిమిర్చి 50 కేజీల బస్తా రూ.600 పలికింది. జూలై మాసంలో రూ.2,600, ఆగస్టులో 2,500 రేట్లు పలికాయి. సెప్టెంబరుమాసంలో 15న రూ.600 మాత్రమే రేటు పలికింది. ఒక్కసారిగా ఒక బస్తాపై రూ.1,800 రేటు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎగుమతి ఇలా.. రుద్రవరం మండలం ఆలమూరు, రుద్రవరం, నాగులవరం గ్రామాల నుంచి పచ్చిమిర్చి చెన్నై, రాజమండ్రి, తణుకు బీమవరం, ఏలూరు, నెల్లూరు తదితర ప్రాంతాలకు పచ్చిమిర్చి ఎగుమతి చేస్తున్నారు. దళారులు నిర్ణయించిన రేటుకే విక్రయిస్తున్నామని రైతులు వాపోతున్నారు. కోత, రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పచ్చిమిర్చికి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.