ఇక నూతన మద్యం పాలసీ
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:40 PM
ఇక నూతన మద్యం పాలసీ
అక్టోబరు 1నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ
11న లాటరీ విధానంతో షాపుల కేటాయింపు
జిల్లాలో 105 మద్యం దుకాణాలకు టెండర్లు
వివరాలు వెల్లడించిన జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి
నంద్యాల క్రైం, అక్టోబరు 1 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన మద్యం పాలసీకి శ్రీకారం చుట్టినట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి రవికుమార్ తెలిపారు. మంగళవారం నంద్యాలలోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నూతన మద్యం పాలసీ విధి విధానాలను ఆయన వెల్లడించారు. కలెక్టర్ జారీ చేసిన గజిట్ నెం.39/2024 ప్రకారం జిల్లాలో 105 మద్యం షాపులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అక్టోబరు 1నుంచి 9వ తేదీ సాయంత్రం 5వరకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 7ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో ఏడు రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కేంద్రంలో టెండరుదారులకు సహాయపడేందుకు ఒక బ్యాంక్ కౌంటర్, ఒక డిజిటల్ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. టెండరుదారులు దరఖాస్తు చేసుకునే సమయంలో వారి మొబైల్ ఓటీపీ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. ఇప్పుడు చేపట్టిన మద్యం విధానంలో ఎక్కువ వివరాలేవీ అవసరం లేదని పేరు, మొబైల్ నెంబర్, ఏదైనా ఐడీ ప్రూఫ్‌తో రూ.2 లక్షల ధరావత్తును సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్ విధానంలో కొనసాగుతుందని ఆయన వివరించారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ నెల 11న ఉదయం 8గంటల నుంచి కలెక్టరేట్ ఆవరణలోని సెంటినరీ హాల్‌లో కలెక్టర్ రాజకుమారి సమక్షంలో లాటరీ విధానంలో షాపుల కేటాయింపు ఉంటుందన్నారు. మద్యం షాపుల కేటాయింపులో మున్సిపాల్టీ, నగర పంచాయతీ, మండలాల్లో జనాభా ప్రాతిపదికన రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు ధర నిర్ణయించినట్లు తెలిపారు. మున్సిపాల్టీ పరిధిలో కేటాయించే షాపులు ఆ పరిధిలోనే ఏర్పాటు చేయాలని, మండలాల్లో కేటాయించిన షాపులు ఆ మండలంలోని ఏ గ్రామంలోనైనా ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. అయితే వంద మీటర్ల దూరంలో విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, మసీదులకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని, ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాముడు, సీఐ కృష్ణమూర్తి, టెక్నికల్ సీఐ సతీష్, ఎస్సైలు దౌలత్‌ఖాన్, అఖిల తదితరులు పాల్గొన్నారు.