Share News

అంతటా భూ సమస్యలే..!

ABN , Publish Date - Oct 20 , 2024 | 11:56 PM

గ్రామసీమల్లో భూ రికార్డుల్లో తప్పులు తడకలుగా తయారయ్యాయి. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఏళ్లుగా తిరుగుతున్నా ఎక్కడి ఫైలు అక్కడే..! అన్న చందంగా మారింది. గుట్టల్లా అర్జీలు పేరుకుపోతున్నాయి.

అంతటా భూ సమస్యలే..!

కర్నూలు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): గ్రామసీమల్లో భూ రికార్డుల్లో తప్పులు తడకలుగా తయారయ్యాయి. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఏళ్లుగా తిరుగుతున్నా ఎక్కడి ఫైలు అక్కడే..! అన్న చందంగా మారింది. గుట్టల్లా అర్జీలు పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది జూన్‌ 12న సీఎం చంద్రబాబు నాయకత్వంలో కొలుదీరిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజలు సమస్యలు పరిష్కారానికి పెద్దపీట వేసింది. ప్రతి సోమవారం ‘ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక’

(పీజీఆర్‌ఎస్‌) ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే చేపట్టడంతో పెద్దఎత్తున భూరికార్డుల్లో తప్పులు చోటు చేకున్నాయి. రైతుల పేరిట ఉన్న భూముల రికార్డుల్లో ఇతరుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. భూ కొలతల్లో మాయ చేశారు. అధికారం మాటున నాటి వైసీపీ నాయకులు కొందరు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా ఈ సమస్యలు వెల్లువెత్తున్నాయి. దీంతో ఈ సమస్యల తక్షణ పరిష్కారానికి నియోజకవర్గం ప్రత్యేక అధికారులను నియమించాలని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదు పరిష్కారం కోసం సీసీఎల్‌ఏ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి పరిష్కరించాలి. సీసీఎల్‌ఏ ఆదేశాల మేరకు కలెక్టరు పి. రంజిత్‌బాషా నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఎక్కువ సమస్యలు మండలాలపై ప్రత్యేక దృష్టికి పెట్టాలని ఆదేశించారు.

కల్లూరు మండలంలో అత్యధికం

టీడీపీ ప్రభుత్వం కొలుదీరి వంద రోజులు పూర్తి అయ్యింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వివిధ గ్రామాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అత్యధికంగా భూ రికార్డుల్లో పేరు మార్పులు, విస్తీర్ణంలో తేడాలు, వంశపారంపర్యంగా వస్తున్న భూముల రికార్డుల్లో మిగులు భూమి, అటవీ భూములు, దేవదాయ భూములు అని ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భూ రికార్డుల్లో తప్పులు సరిచేసి తమకు హక్కు కల్పించాలని 765 మంది రైతులు ఫిర్యాదులు చేశారు. భూ సేకరణ సమస్యలు 362, భూ ఆక్రమణలు 101, ఇంటి స్థలాలు కేటాయించాలని 75 మంది అర్జీలు ఇచ్చారు. అత్యధికంగా కల్లూరు మండలంలో 176, ఆదోని మండలంలో 155, ఓర్వకల్లు మండలంలో 143, దేవనకొండ మండలంలో 100, గోనెగండ్ల మండలంలో 100 సమస్యలు పెండింగులో ఉన్నట్లు తెలుస్తున్నది. వీటితో పాటుగా పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రత్యేక అధికారుల నియామకం ఎంతో కలసి వస్తుందని అంటున్నారు.

నియోజకవర్గాల వారిగా ప్రత్యేక అధికారులు వీరే

నియోజకవర్గం అధికారి హోదా

ఆదోని, ఎమ్మిగనూరు ఎం.మౌర్య భరద్వాజ్‌ సబ్‌ కలెక్టరు ఆదోని

పత్తికొండ భరత్‌నాయక్‌ ఆర్డీఓ, పత్తికొండ

కోడుమూరు కె. సందీప్‌కుమార్‌ ఆర్డీఓ, కర్నూలు

కర్నూలు ఎస్‌. రవీంద్రబాబు కమిషనర్‌,

కర్నూలు కార్పొరేషన్‌

మంత్రాలయం సీహెచ్‌ విశ్వనాథ్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరు,

హంద్రీనీవా యూనిట్‌-3

ఆలూరు రామునాయక్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరు,

హంద్రీనీవా యూనిట్‌-4

పాణ్యం సీవీ నారాయణమ్మ పీఏ స్పెషల్‌ కలెక్టరు,

ఎస్‌ఎస్‌పీ, కర్నూలు

Updated Date - Oct 20 , 2024 | 11:56 PM