82 లక్షల పని దినాలు పూర్తి
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:07 AM
జిల్లాలో తీవ్ర కరువు తీవ్రత దృష్ట్యా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రైతులు, రైతు కూలీలకు 92 లక్షల పనిదినాలను కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించగా.. ఇప్పటికి 82 లక్షల పనిదినాలను కల్పించామని డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి తెలిపారు.
ఉపాధి లక్ష్యం 92 లక్షల పని దినాలు
ఇంకా పెంచే అవకాశం
డ్వామా పీడీ అమర్నాథ్‌రెడ్డి
కర్నూలు(అగ్రికల్చర్), ఫిబ్రవరి 12: జిల్లాలో తీవ్ర కరువు తీవ్రత దృష్ట్యా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రైతులు, రైతు కూలీలకు 92 లక్షల పనిదినాలను కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించగా.. ఇప్పటికి 82 లక్షల పనిదినాలను కల్పించామని డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ కార్యక్రమానికి సంబంధించి లేబర్ కంపోనెంట్ కింద రూ.217 కోట్లు, మెటీరియల్ కంపోనెంటు కింద రూ.98 కోట్లు ఖర్చు చేశామన్నారు. కరువు నివారణకు ప్రభుత్వం మరో రూ.10 లక్షల దాకా పని దినాలను కేటాయించే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది 4,728 ఎకరాల్లో పండ్ల తోటలను పెంచేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. 2023-24 సంవత్సరంలో పండ్ల తోటల పెంపకాన్ని అభివృద్ధి చేసి రైతులకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. డిసెంబరు 18 నాటికి లేబర్, మెటీరియల్ కాంపోనెంటు కింద రూ.310 కోట్లు ఖర్చు చేశామని, ఇందులో ఉపాధి కూలీలకే రూ.217 కోట్లు చెల్లించామన్నారు. ఇప్పటి దాకా 4,504 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించామని, కరువు ప్రాంతాలుగా ప్రకటించిన మండలాల్లో అదనంగా మరో 50 పనిదినాలను కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. గత ఏడాది ఉపాధి పనులకు కేవలం 10వేల మంది కూలీలనే వినియోగించామని, ఈ ఏడాది రోజుకు 65వేల మందికి పని కల్పించాలనే లక్ష్యం కాగా, ప్రస్తుతం 63వేల మంది వరకు ఉపాధి పనులకు హాజరవుతున్నట్లు డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి తెలిపారు.