Share News

వరాల జల్లు కురిసేనా!

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:48 AM

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఎన్‌.చంద్రబాబు నాయుడు తొలిసారిగా బుధవారం మచిలీపట్నం వస్తున్నారు. ఇక్కడ అనేక సమస్యలు నగర వాసులను వేధిస్తున్నాయి. వీటిపై ముఖ్యమంత్రి చొరవ చూపి తమపై వరాల జల్లు కురిపిస్తారనే ఆశతో బందరు వాసులు ఎదురు చూస్తున్నారు.

వరాల జల్లు కురిసేనా!

నేడు సీఎం చంద్రబాబు మచిలీపట్నం రాక

వేధిస్తున్న డ్రెయినేజీ సమస్య

సొంత భవనాలకు నోచుకోని ప్రభుత్వ కార్యాలయాలు

పూర్తికాని బందరు పోర్టు, మెడికల్‌ కళాశాల భవన నిర్మాణాలు

రూ.65వేల కోట్ల ఆయిల్‌ రిఫైనరీ కార్పొరేషన్‌పైప్రకటన వచ్చేనా!

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఎన్‌.చంద్రబాబు నాయుడు తొలిసారిగా బుధవారం మచిలీపట్నం వస్తున్నారు. ఇక్కడ అనేక సమస్యలు నగర వాసులను వేధిస్తున్నాయి. వీటిపై ముఖ్యమంత్రి చొరవ చూపి తమపై వరాల జల్లు కురిపిస్తారనే ఆశతో బందరు వాసులు ఎదురు చూస్తున్నారు.

వర్షం కురిస్తే కాలువలను తలపిస్తున్న రోడ్లు

ఇటీవలే మునిసిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పడిన మచిలీపట్నంలో కొద్దిపాటి వర్షం కురిస్తే ప్రధాన రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. సముద్ర మట్టానికి రెండు అడుగుల దిగువన ఉన్న నగరాన్ని డ్రెయిన్‌ల సమస్య వేధిస్తోంది. డ్రెయిన్‌లను కొంతమేర నిర్మాణం చేసినా వాటిని చివరి ప్రాంతాలలో ప్రధాన డ్రెయిన్‌లకు అనుసంధానం చేయకపోవడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు.

నగరంలో తీవ్ర తాగునీటి ఎద్దడి

మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో 2.50లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. మచిలీపట్నం మండలంలో మరో 75వేల మంది నివాసం ఉంటున్నారు. సముద్రతీర ప్రాంతం కావడంతో ఏటా వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తుతోంది. నగరం, మండల ప్రజల తాగునీటి అవసరాల కోసం మచిలీపట్నంకు 11 కిలో మీటర్ల దూరంలో 180 ఎకరాల్లో తరకటూరు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు ఉంది. వేసవిలో కాలువలకు నీరు రాకపోవడంతో ఈ ట్యాంకులో నీటి నిల్వలు తగ్గిపోయి తాగునీటి కొరత ఏర్పడుతోంది. మండలంలోని సముద్రతీరం వెంబడి గ్రామాల్లోనూ తాగునీటి చెరువులు లేకపోవడంతో తరకటూరు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు ద్వారానే తాగునీటి అవసరాలు తీరుస్తూ వస్తున్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా మచిలీపట్నం మండలంలో రూ.230 కోట్లతో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ నిధులను విడుదల చేసి ఇంటింటికీ కుళాయి పథకాన్ని అమలు చేయడంతోపాటు మండలంలో 100 నుంచి 150 ఎకరాల్లో తాగునీటి చెరువును నిర్మిస్తే తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

బీపీసీఎల్‌ వస్తేనే..

భారత్‌ పెట్రోలియం రిఫైనరీ కార్పొరేషన్‌ను మచిలీపట్నంలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం పెద్దలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే చర్చలు జరిపారు. రూ.65 వేల నుంచి 70 వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మాణం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్న మచిలీపట్నంలో బీపీసీఎల్‌ ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. జాతీయ రహదారి, రైల్వేలైన్‌, ఓడల రాకపోకలకు బందరు పోర్టు అందుబాటులో ఉంది. ఈ రిఫైనరీ ఏర్పాటుకు మచిలీపట్నంలో భూమి కూడా ఉంది. ఈస్ట్‌కోస్ట్‌ ప్రాంతంలో ఆయిల్‌ రిఫైనరీ లేదు. మచిలీపట్నంలో ఈ రిఫైనరీని ఏర్పాటు చేస్తే రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రమే మారుపోతుంది.

ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు లేవు

కృష్ణాజిల్లా విడిపోయి రెండున్నర సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ విభాగాలకు భవనాలు లేక అద్దె భవనాల్లోనే కార్యాలయాలు కొనసాగుతున్నాయి. జిల్లా పౌరసరఫరాల సంస్థ, బీసీ కార్పొరేషన్‌, గృహ నిర్మాణ సంస్థ, సర్వశిక్ష, డీసీవో, భూగర్భ గనులశాఖ, ఉద్యానశాఖ, రవాణాశాఖ, అటవీశాఖ తదితర కార్యాలయాలు అద్దె భవనాల్లోనే సాగుతున్నాయి. కలెక్టరేట్‌లో ఎప్పుడు కూలిపోతాయో తెలియని స్థితిలో ఉన్న పాత భవనాల్లో సాంఘిక సంక్షేమశాఖ, బీసీ సంక్షేమశాఖ భవనాలు ఉన్నాయి. మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌గా మారినా, ఇరుకుగా ఉన్న భవనంలోనే పరిపాలనను కొనసాగిస్తున్నారు. మచిలీపట్నం ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల భవనాలకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పునాదులు వేసినా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి నిర్మాణాలను నిలిపివేసింది.

బందరు పోర్టు పనులను పరుగులు పెట్టించాల్సిందే !

బందరు పోర్టు పనులను 2023, మే నెలలో ప్రారంభించారు. ఇప్పటి వరకు 30శాతం మేర పనులు పూర్తయ్యాయి. అలాగే రూ. 550 కోట్ల వ్యయంతో చేపట్టిన మచిలీపట్నం మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోజుల కిందటే ఇక్కడ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. మెడికల్‌ కళాశాలలో వైద్య సేవలు ప్రారంభించడానికి భవనాలు అందుబాటులో లేవు. కేవలం మొదటి, రెండో సంవత్సరం తరగతుల నిర్వహణకే ఇక్కడ భవనాలు అందుబాటులో ఉన్నాయి. ఇలా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో నెలకొన్న సమస్యలపై చంద్రబాబు మాట్లాడతారని, తమ సమస్యలకు పరిష్కారం చూపుతారని నగర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Oct 02 , 2024 | 07:44 AM