ఎవరి ఓటు ఎటు..?
ABN , Publish Date - Feb 13 , 2024 | 01:17 AM
ఓటర్ల తుది జాబితా పరిశీలనలో అక్రమాలు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. సెంట్రల్ నియోజకవర్గంలో చనిపోయిన వారి ఓట్లను తొలగించమంటే, మరో బూత్‌కు బదిలీ చేసిన ఉదంతం మరువకముందే..
పశ్చిమలో భారీగా ఓటర్ల బూత్ లెవల్ బదిలీలు
40వ డివిజన్‌లోని 45వ బూత్‌కు చెందిన 800 మంది పేర్లు గల్లంతు
వారి స్థానంలో తూర్పు, పశ్చిమలోని వేరే బూత్ ఓటర్లు
టీడీపీ నాయకుల పరిశీలనలో గుర్తింపు
కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని యోచన
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/విద్యాధరపురం) : ఓటర్ల తుది జాబితా పరిశీలనలో అక్రమాలు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. సెంట్రల్ నియోజకవర్గంలో చనిపోయిన వారి ఓట్లను తొలగించమంటే, మరో బూత్‌కు బదిలీ చేసిన ఉదంతం మరువకముందే.. పశ్చిమలో ఒక బూత్‌కు చెందిన వారి ఓట్లను మరో బూత్‌కు బదిలీ చేయటం వివాదానికి దారితీసింది. ఇప్పటికే అధికార పార్టీ కార్పొరేటర్ ఆంజనేయరెడ్డి స్కూల్ పేరుతో భారీగా బోగస్ ఓట్లు నమోదైన విషయం బయటపడింది. సోమవారం మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక 40వ డివిజన్ పరిధిలోని 45వ నెంబర్ పోలింగ్ బూత్‌లో వందల సంఖ్యలో ఓటర్ల పేర్లు కనిపించటం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఓటర్ల స్థానంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని అశోక్‌నగర్, మాచవరానికి చెందిన ఓటర్లతో పాటు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని విద్యాధరపురానికి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో 45వ నెంబర్ బూత్‌లోకి వచ్చారు. టీడీపీ నాయకుల పరిశీలనలో 800కు పైగా ఇతర నియోజకవర్గాలు, బూత్‌లకు చెందినవారు బదిలీ అయ్యారని గుర్తించారు. ఒక్కసారిగా ఇన్ని ఓట్లను ఎక్కడికి బదిలీ చేశారన్న విషయం మాత్రం తెలియట్లేదు. వీటిపై జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావుకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.